Begin typing your search above and press return to search.

రోజురోజుకు పడిపోతున్న రూపాయి.. భవిష్యత్ కష్టమేనా..!

By:  Tupaki Desk   |   7 Dec 2022 9:27 AM GMT
రోజురోజుకు పడిపోతున్న రూపాయి.. భవిష్యత్ కష్టమేనా..!
X
రూపాయి విలువ రోజురోజుకు కనిష్ట స్థాయికి పడిపోతుంది. రూపాయి విలువను పడిపోకుండా ఆర్బీఐ చర్యలు చేపడుతున్నప్పటికీ సత్ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ క్రమంలోనే బుధవారం ఆర్బీఐ ద్రవ్య విధానానికి ముందు ప్రారంభ ట్రేడింగ్ లో యూఎస్ డాలర్ తో రూపాయి విలువ 25 పైసలు క్షీణించి 82.75 వద్ద ట్రేడింగ్ కు చేరుకుంది.

విదేశీ మార్కెట్లో డాలర్ కు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుండటం.. విదేశీ నిధుల తరలింపు వంటి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ట్రేడింగ్ పై ప్రభావం చూపుతుందని ఫారెక్స్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద.. దేశీయ యూనిట్ డాలర్‌తో పోలిస్తే 82.74 వద్ద ప్రారంభమైందని తెలిపారు.

ఆ తర్వాత దాని మునుపటి ముగింపుతో పోలిస్తే ఏకంగా 25 పైసల నష్టాన్ని నమోదు చేసి 82.75 స్థాయికి రూపాయి దిగజారిందని వెల్లడించారు. కాగా మంగళవారం రూపాయి విలువ ఏకంగా 65 పైసలు క్షీణించిందని తెలిపారు. యూఎస్ డాలర్ తో పోలిస్తే ఒక నెల దిగువ స్థాయికి అంటే రూ. 82.50 కి పడిపోయిందని తెలిపారు.

మరోవైపు ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.09శాత మేర పెరిగి 79.42 డాలర్లకు చేరింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగాయి. 30 షేర్ బీఎస్‌ఈ సెన్సెక్స్ 148 పాయింట్లు క్షీణించి 62,478 వద్ద ట్రేడ్ కాగా నిఫ్టీ 50 పాయింట్లు లేదా 0.17శాతం మేర తగ్గి 18,580 వద్ద ట్రేడయింది.

విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం రోజున 635.35 కోట్ల విలువైన షేర్లను ఆప్లోడ్ చేయడంతో క్యాపిటల్ మార్కెట్లో నికర విక్రయదారులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆర్బీఐ రెపో రేటును తాజాగా 35 బేసిస్ పాయింట్స్ పెంచింది. అయితే రూపాయి విలువ పతనం అవుతుండటంతో విదేశీ మారకం క్రమంగా తగ్గుతూ పోతుంది. దీని వల్ల రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే హెచ్చరికలు విన్పిస్తున్నాయి.

రూపాయి పతనం పెట్రోల్.. డీజీల్ రేట్ల పెరుగదలపై ప్రభావం చూపనుంది. అది కనుక జరిగితే నిత్యావసర ధరలు మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సామాన్యుడు నానా ఇబ్బందులు పడున్నాడు. ఈ క్రమంలోనే రూపాయి ధరకు కళ్లెం వేసేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. రూపాయి కరెన్సీతోనే పలు దేశాలతో మారకం జరిగేలా కేంద్రం ఒప్పందాలు చేసుకుంటోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.