Begin typing your search above and press return to search.

రైల్వే జోన్ భద్రమట‌... నమ్మొచ్చా...?

By:  Tupaki Desk   |   28 Sep 2022 10:31 AM GMT
రైల్వే జోన్ భద్రమట‌... నమ్మొచ్చా...?
X
విశాఖ రైల్వే జోన్ అన్న ఆలోచనకు యాభై ఏళ్ళు పూర్తి అయితే ఉద్యమాలకు పాతికేళ్ల పైన చరిత్ర ఉంది. ఇక విభజన చట్టంలో దాన్ని పెట్టి ఆశలు రేపి ఎనిమిదేళ్ళు సులువుగా గడచిపోయాయి. ఇప్పటికి మూడున్నరేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వచ్చి మరీ రైల్వే జోన్ ఇచ్చేస్తున్నామని ఒక సభ పెట్టి మరీ ప్రకటించారు. ఇవన్నీ ఆశలను వేయింతలు చేశాయి. కానీ ఆచరణలో అడుగు ముందు పడలేదు.

రైల్వే జోన్ మీద డీపీయార్ రెడీ చేసి ఇస్తే రైల్వే బోర్డు పక్కన పెట్టేస్తోంది. విశాఖ రైల్వే జోన్ కి అసలు ఫీజుబిలిటీ లేదని చెబుతున్నారు. విశాఖలో రైల్వే స్థలాలు దండీగా ఉన్నాయి. నిధులు ఇస్తే చాలు జోన్ రెడీ అని చెబుతున్నా కేంద్ర పెద్దలు బాధ్యులైన మంత్రులు మాత్రం ఇదిగో అదిగో అంటూ మళ్లీ ఎన్నికల దాకా కధను జాగ్రత్తగా నడిపిస్తున్నారు.

ఈ మధ్యలో రైల్వే జోన్ రాదు, ఇవ్వరు అన్న ప్రచారం కూడా ఉంది మరి. అయితే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం రైల్వే జోన్ ఎక్కడికీ పోలేదు భద్రంగా ఉందని చెబుతున్నారు. అది కచ్చితంగా వస్తుందని ఆయన అంటున్నారు. దానికి ఆధారం ఏంటి అంటే ఆయన గత పార్లమెంటు సమావేశాల్లో కూడా తను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖమంత్రి తన సమాధానం ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారని అంటున్నారు.

ఇక ఇదే విషయం మీద తాను కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ వి కె త్రిపాఠీతో మాట్లాడానని ఆయన కూడా పత్రికలలో వచ్చిన వార్తలలో నిజం లేదని,రైల్వే జోన్ ప్రక్రియ యధాతధంగా కొనసాగుతున్నదని చెప్పారని అంటున్నారు. అందువల్ల విశాఖ ప్రజలు విశాఖ రైల్వే జోన్ పై వచ్చిన పుకార్లను నమ్మవద్దని జివీఎల్ చెబుతున్నారు. విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యమని దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని బల్ల గుద్ది మరీ భరోసా ఇస్తున్నారు.

సరే జీవీఎల్ మాటలే కొంతసేపు నమ్మాలనుకున్నా ఎపుడో 2019 ఫిబ్రవరిలో ప్రధాని మోడీ విశాఖ వచ్చి రైల్వే జోన్ ఇస్తున్నామని ప్రకటించిన తరువాత కనీసమాత్ర‌మైన పని కూడా ఇంతవరకూ మొదలుకాలేదే. మరి జీవీఎల్ మాటలను ఎలా నమ్మాలని మేధావులు ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. ఇక తడవకో సారి కేంద్ర పెద్దలు ఫీజుబులిటీ లేదు అంటూ చేదు కబుర్లు చెబుతున్నారని కూడా అంటున్నారు.

కేంద్రం తలచుకుంటే క్షణాలలో రైల్వే జోన్ విశాఖకు వచ్చేదని కానీ ఎందుకో తీవ్ర జాప్యం జరుగుతోంది అంటే జోన్ డౌట్లో పడినట్లే అని అధిక సంఖ్యాకులు నమ్ముతున్నారు. లేదూ కాదూ అనుకుంటూ 2024 ఎన్నికల దాకా ఇదే ఇష్యూ కొనసాగించి ఎన్నికల్లో హామీ చేసుకుని తాము తిరిగి అధికారంలోకి వచ్చాక ఏకంగా జోనూ లేదూ గీనూ లేదు అనిపిస్తారన్న డౌట్లు కూడా అందరికీ ఉన్నాయట.

మొత్తానికి విశాఖలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న జీవీఎల్ అర్జంటుగా అన్నీ పుకార్లు, తప్పు అని ఖండిస్తున్నారు. నీ జనాలు మాత్రం జోన్ విషయంలో ఇక నమ్మకాలు ఏవీ పెట్టుకోవడం లేదు అన్నది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.