Begin typing your search above and press return to search.

నాగుల విషం లీటర్ ధర అంతర్జాతీయ మార్కెట్‌ లో ఎంతో తెలుసా ?

By:  Tupaki Desk   |   3 Aug 2021 11:45 AM GMT
నాగుల విషం లీటర్ ధర అంతర్జాతీయ మార్కెట్‌ లో ఎంతో తెలుసా ?
X
పాము విషం చాలా ప్రమాదకరం. కొన్ని పాములు కరిచినా ఏమీ కాదు , మరికొన్ని పాములు కరిచిన క్షణాల్లోనే ప్రాణాలు పొయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటి పాము విషాన్ని భారీ ధరకు కొంటారని తెలుసా, కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు తదితర విషం కలిగిన పాములున్నా.. పాములే పట్టేవాళ్లు మాత్రం నాగు పాముల్ని మాత్రమే పట్టుకుంటారు. ఎందుకంటే, మన రాష్ట్రంలో నాగు పాములు విరివిగా దొరుకుతాయి. వాటి విషానికి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంటుంది. సరీసృపాల జాతికి చెందిన ఆడ నాగులు 12 నుంచి 30 వరకు గుడ్లు పెడతాయి. రెండు నెలలు పొదుగుతాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములకు సైతం పూర్తిస్థాయిలో పనిచేసే విషపు గ్రంథులుంటాయి. ఏ వయసు నాగు పామును పట్టినా విషం సేకరించేందుకు అవకాశం ఉంటుంది. నాగు పాము చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతర పాములకు భిన్నంగా నాగు పాము పడగ విప్పుతుంది.

టి పడగ వెనుక వివిధ రంగుల్లో అండాకార గుర్తుల నడుమ గీత, లోపలి వైపు వివిధ ఆకారాలు ఆకర్షణీయంగా ఉంటాయి. పాములోళ్ల నాద స్వరానికి అనుగుణంగా పడగ విప్పి ఆడే నాగు పాముల ఆట చూసేవాళ్లకు హృద్యంగా ఉంటుంది. నాగుపాము విషం సేకరణకు, ప్రదర్శనలతో డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. అందువల్లే పాములోళ్లు నాగు పాములను మాత్రమే పడుతుంటారు. సాధారణంగా పాములోళ్లు 10 నాగు పాముల నుంచి తులం విషం సేకరిస్తారు. నాగుతల పైభాగం, దానికి కిందనున్న భాగాన్ని చేతులతో గట్టిగా నొక్కుతూ పాము విషపు గ్రంథులను అదమటం ద్వారా కోరల్లోంచి విషాన్ని కక్కిస్తారు. అలా సేకరించిన విషాన్ని దళారులకు తులం 4 వేలకు కొంచెం అటూఇటుగా అమ్ముకుంటున్నారు.

నాగు పాముల విషాన్ని తులం 4 వేల రూపాయలు పెట్టి కొనే దళారులు.. అదే విషాన్ని దళారులు 40 వేలకు అమ్ముతారట. దేశీయ మార్కెట్‌లో లీటరు నాగు పాముల విషం ధర సుమారు 40 లక్షలట. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆ ధర కోటి పైమాటేనట. అంతటి విలువైన విషాన్ని ప్రాణాలొడ్డి మరీ పాముల నుంచి కక్కించే పాములోళ్లు మాత్రం కూటికి లేని నిరుపేదలే.. వెల్దుర్తి వద్ద నాగుపాముల్ని ఒడిసి పట్టి వాటి విషం సేకరించే వారు ఆసక్తికర విషయాలు చెపుతున్నారు. దళారి ఆ విషాన్ని ఏం చేస్తున్నాడు, ఎంతకు అమ్ముకుంటున్నాడన్నది వీరికి పట్టదు. అలా సేకరించిన విషాన్ని దళారులు పది రెట్లు అధిక ధరకు విక్రయిస్తారని తెలుస్తోంది. పాములోళ్లు సేకరించిన విషాన్ని రబ్బరు మూత గల చిన్న గాజు సీసాలో భద్రపరుస్తారు. దళారులు విషాన్ని కొనే సమయంలో దాని నాణ్యతను పరీక్షించి మరీ కొంటున్నారట. దళారులు కోడిని తెచ్చి దానికి చిన్నపాటి గాయం చేస్తారట. పాములోళ్లు సేకరించిన విషాన్ని పిన్నీసు మొనతో గాయమైన కోడికి పూస్తారు. అది అరగంటలో మరణిస్తే నాణ్యమైనదిగా గుర్తిస్తారట. లేదంటే ఆ విషాన్ని కొనరట

పాము విషం మనిషి ప్రాణాల్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. పాము విషానికి ముఖ్యంగా విదేశాల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్నిరకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారట. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే సూది మందును సైతం స్వల్పశాతం విషం ఉపయోగించే తయారు చేస్తారట. ప్రస్తుతం కరోనా ప్రభావం పాములు పట్టేవాళ్లపైనా పడింది. దీంతో వారి జీవనాధారం కూడా భారమైంది. దీంతో కొందరు భిక్షమెత్తి బతకాల్సి వస్తోంది. ఇంట్లో చిన్న పిల్లలు సైతం భిక్షాటన చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం. నంద్యాల బొమ్మల సత్రంలో పదుల కుటుంబాలు ఇదే జీవనాధారంగా బతుకుతున్నారు. ఎరుకల జాతికి చెందిన వారికి తాతల కాలం నుంచి నాగుపాములు పట్టడం, వాటినుంచి విషం తీసి అమ్మడమే తెలిసిన విద్య, పాము విషం తీసే క్రమంలో.. కొందరు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో వాళ్ల దగ్గర నాగమల్లి వేరు లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అంట. నాగమల్లి వేరు, పాము తల నుంచి సేకరించిన రాయి లేకపోతే పాములు పట్టడం కష్టమంటున్నారు. అవే వారికి ధైర్యం అంటున్నారు. పాముకాటుకు గురైన వాళ్లు వారి దగ్గరకు వస్తే నాగమల్లి వేరుతో నయం చేస్తారు.