Begin typing your search above and press return to search.

షాక్: సాయం కోరుతూ సారు కాన్వాయ్ వాహనం కింద పడ్డ వ్యక్తి

By:  Tupaki Desk   |   2 Jun 2020 6:10 AM GMT
షాక్: సాయం కోరుతూ సారు కాన్వాయ్ వాహనం కింద పడ్డ వ్యక్తి
X
రాతలు మారాలని.. బతుకు వెతలు తీరాలంటే కలల తెలంగాణ వస్తే చాలు.. ఆకలి కేకలు కొలిక్కి రావటమే కాదు.. సొంత రాష్ట్రంలో సొంత ప్రభుత్వం నీడన ‘బంగారు తెలంగాణ’ సాకారమవుతుందన్న వాదన బలంగా వినిపించేది. దీనికి తగ్గట్లే సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్ర వాదన ఫలించి.. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ జూన్ రెండుకు తెలంగాణ వచ్చి ఆరేళ్లు అవుతోంది. వాస్తవానికి ఆవిర్భావ వేడుకల్ని భారీ ఎత్తున నిర్వహించాలని భావించారు.

అనుకోని రీతిలో విరుచుకుపడిన మహమ్మారి కారణంగా.. ఈసారికి ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే ఆవిర్భావ వేడుకల్నితెలంగాణ ప్రభుత్వం సాదాసీదాగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఉదయాన్నే (మంగళవారం) గన్ పార్కువద్దకు వచ్చారు. అమరవీరులకు నివాళులకు అర్పించారు. వాహనంలో నుంచి దిగి.. పుష్పగుచ్చాన్ని ఉంచిన కేసీఆర్.. మళ్లీ కారు ఎక్కేశారు. మీడియాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తిరుగు పయనమయ్యారు.

ఈ సందర్భంగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ వాహనం కింద ఒక వ్యక్తి అనూహ్యంగా ముందుకు వచ్చి కారు కింద పడ్డారు. దీంతో..సీఎం కాన్వాయ్ లోని వారంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకున్న వారు.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తనకు ఉపాధి లేదని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. తనను కాపాడాలంటూ వేడుకున్నాడు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.