Begin typing your search above and press return to search.

ఓరుగల్లులో అప్పుడే పోరు మొదలైందా?

By:  Tupaki Desk   |   18 Oct 2020 2:30 AM GMT
ఓరుగల్లులో అప్పుడే పోరు మొదలైందా?
X
వరంగల్ జిల్లా కేంద్రంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి పోటీచేసేందుకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. దీంతో వివిధ పార్టీలు వరంగల్ కేంద్రంగా పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

వరంగల్ లో సన్నాహక సమావేశాలు పోటాపోటీగా నిర్వహిస్తూ పార్టీలు వేడి పెంచాయి. ఇప్పటి నుంచే ఓట్లు రాబట్టుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీకి ధీటుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కూడా మీటింగ్లు నిర్వహిస్తున్నారు.

కాగా తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసేందుకు జర్నలిస్టులు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికపై టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్, టీజేఎస్ సైతం సవాల్ గా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, విద్యాసంస్థల అధినేత సంగంరెడ్డి సుందర్ రాజు టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరూ ఎవరికి వారే అప్పుడే బరిలోకి దిగి వివిధ వర్గాల మద్దతు కూడగడుతున్నారు.

బీజేపీ నుంచి ఈసారి బరిలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందర్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారని టాక్‌.

ఇక తెలంగాణ జనసమితి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. కోదండరాంకు మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ మరో నేతను బరిలోకి దించాలని డిసైడ్ అయ్యింది. సీనియర్ నేతకు టికెట్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది.

మొత్తం మీద ఈసారి శాసనమండలి పట్టభద్రుల పోరు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. కోదండరాంకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతిస్తే పరిస్థితి వేరుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.