Begin typing your search above and press return to search.

అంత‌రిక్షం నుంచి ఎత్త‌యిన యుద్ధ భూమి వ‌ర‌కు జాతీయ జెండా రెప‌రెప‌లు!

By:  Tupaki Desk   |   15 Aug 2022 7:38 AM GMT
అంత‌రిక్షం నుంచి ఎత్త‌యిన యుద్ధ భూమి వ‌ర‌కు జాతీయ జెండా రెప‌రెప‌లు!
X
75 ఏళ్ల ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాలు, 76వ భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని భార‌త మువ్వెన్న‌ల జెండా అంత‌రిక్షంలోనూ ఆవిష్కృత‌మైంది. స్పేడ్ కిడ్జ్ అనే సంస్థ భూమి నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో అంత‌రిక్షంలో భార‌త జాతీయ జెండాను రెప‌రెప‌లాడించింది. జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌న సంగీతంతో స్పేస్ కిడ్జ్ జాతీయ జెండాను ఆవిష్క‌రించింది.

అదేవిధంగా భార‌త సంతతికి చెందిన నాసా సైంటిస్టు రాజాచారి భార‌తీయుల‌కు అంత‌రిక్షం నుంచి స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. అంత‌రిక్ష కేంద్రం నుంచి తీసిన హైద‌రాబాద్ ఫొటోను కూడా ఆయ‌న సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. రాజాచారి తండ్రి స్వ‌స్థ‌లం హైద‌రాబాద్ కావ‌డం గ‌మ‌నార్హం.

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా సియాచిన్ సైనికులు మంచు ప‌ర్వ‌తాల‌పై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. సియాచిన్ ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన యుద్ధ భూమి కావ‌డం గ‌మ‌నార్హం.

హిమాల‌యాల్లో ఉన్న ఈ ప్ర‌పంచంలోనే అతి ఎత్తయిన యుద్ధ భూమి భార‌త్ ఆధీనంలోనే ఉంది. ఈ నేప‌థ్యంలో 76వ స్వాతంత్య్ర దినోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని సైనికులు సియాచిన్‌లో భార‌త త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఇక దేశ‌, విదేశాల్లో భార‌తీయ‌ ప్ర‌ముఖుల నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల వ‌ర‌కు స్వాతంత్య్ర దినోత్సవ సంబ‌రాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఢిల్లీలో ఎర్ర‌కోట‌, ఇండియా గేట్ త‌దిత‌ర ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఘ‌నంగా దేశ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి.

హైద‌రాబాద్ లోని గోల్కొండ‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, విజ‌యవాడ పీడ‌బ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జాతీయ జెండాను ఎగుర‌వేశారు.