సాగర్ లో మెజార్టీ పెరిగిందంటే.. టీఆర్ఎస్ బలపడిందా?

Mon May 03 2021 16:00:01 GMT+0530 (IST)

The majority in Sagar has increased .. Has TRS strengthened?

అంచనాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిందని చెప్పాలి. మొదట్నించి అనుకున్నట్లే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయాన్ని సాధించారు. తండ్రికి మించిన తనయుడు అన్న రీతిలో.. గత ఎన్నికల్లో తన తండ్రి సాధించిన 7726 ఓట్ల అధిక్యతతో పోలిస్తే.. తాజాగా ఆయన 18872 ఓట్ల మెజార్టీతో గెలుపొందారుజానారెడ్డి రాజకీయ అనుభవం అంత లేని నోముల భగత్ వయసు.. తాజా ఎన్నికల్లో ఆయన్ను ఓడించటం ద్వారా అందరి కంట్లో పడ్డారని చెప్పాలి. మొత్తంగా టీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుందని చెప్పాలి. ఈ ఎన్నికతో జానారెడ్డి పని అయిపోయిందని.. ఆయన రిటైర్మెంట్ తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం పాతిక రౌండ్లకు రెండు రౌండ్లు (10 14)లో మాత్రమే కాంగ్రెస్ స్వల్ప అధిక్యతను సాధించింది.

ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ.. టీడీపీలు డిపాజిట్లు కోల్పోయాయి. బీజేపీ అభ్యర్థికి 7676 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థికి కేవలం 1714 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 41 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి ఎవరూ తమ ప్రభావాన్ని చూపలేకపోయారు. 41 మందిలో కేవలం ఏడుగురికి మాత్రమే వెయ్యికి పైగా ఓట్లు రావటం గమనార్హం. తాజా ఫలితం నేపథ్యంలో బోలెడన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితంతో తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని.. ఆ పార్టీని కొట్టే పార్టీ మరేదీ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇందులో నిజం లేదని చెప్పాలి.

ఎందుకంటే.. సాగర్ ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతలా ఫోకస్ పెట్టారో చెప్పాల్సిన అవసరం లేదు. పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలకు పర్సనల్ గా బాధ్యతలు అప్పగించి.. పోలింగ్ పూర్తి అయ్యే వరకు నియోజకవర్గం నుంచి బయటకు రావొద్దని.. గెలిచేందుకు ఉన్న ఏ ఒక్క మార్గాన్ని వదిలిపెట్టొద్దన్న ఆదేశాన్ని ఇవ్వటమే కాదు.. అందుకు తగ్గట్లే పావులు కదిపిన విషయాన్ని మర్చిపోకూడదు.

తమకున్న శక్తియుక్తులు మొత్తాన్ని సమీకరించుకోవటం వల్లనే.. తాజా గెలుపు సాధ్యమైందని చెప్పాలి. ప్రత్యేక సందర్భాల్లో తప్పించి.. సాధారణంగా ఉప ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయన్నది మర్చిపోకూడదు. ఇటీవల తనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో.. ఎవరికి అవకాశం ఇవ్వకూడదన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించటం కూడా ఇంత ఎక్కువ మెజార్టీకి కారణంగా చెప్పక తప్పదు. ఈ ఫలితంతోనే ప్రతిపక్షాల పని అయిపోయిందని.. అధికారపక్షానికి తిరుగులేదన్న వాదనలు వినిపించటం సరికాదు.