Begin typing your search above and press return to search.

కేంద్ర స‌ర్కారు తెలివి మామూలుగా లేదు

By:  Tupaki Desk   |   23 Sep 2021 9:36 AM GMT
కేంద్ర స‌ర్కారు తెలివి మామూలుగా లేదు
X
క‌రోనా మ‌హమ్మారి దేశంలో ఎంత‌టి విల‌య‌తాండవం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా క‌ట్ట‌డిలో కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్న అభిప్రాయాలున్నాయి. స‌కాలంలో స్పందించ‌క‌పోవ‌డంతో పాటు అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో లోపం స‌రైన వైద్య స‌దుపాయాలు స‌మ‌కూర్చ‌క‌పోవ‌డం ఇలా మోడీ స‌ర్కారును ఎత్తిచూప‌డానికి చాలా కార‌ణాలున్నాయి. ఇక క‌రోనా బాధితుల విష‌యంలో కేంద్రం ఉదారంగా వ్య‌వ‌హ‌రించ‌లేదు. తొలి ద‌శ క‌రోనా త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్యాకేజీ ద్వారా బాధితుల‌కు న్యాయం జ‌రిగింద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఇక తాజాగా క‌రోనా మృతుల‌కు సాయం అందించే విష‌యంలోనూ కేంద్ర ప్ర‌భుత్వం తెలివి మామూలుగా లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రం క‌రోనా మృతుల కుటుంబాల‌కు ఎలాంటి సాయం చేయ‌లేదు. దీనిపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తూనే వ‌చ్చింది. సాయం చేయాలంటేనేమో కేంద్రానికి మ‌న‌సు రావ‌డం లేదు. సాయం చేయ‌క‌పోతే కోర్టు ఒప్పుకోదు. ఈ నేప‌థ్యంలో తెలివిగా ఓ నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా మృతుల కుటుంబాల‌కు రూ.50 వేల చొప్పున సాయం చేస్తామ‌ని కోర్టుకు కేంద్రం తెలిపిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా మృతుల కుటుంబాల‌కు రూ.50 వేల చొప్పున కేంద్రం ఇవ్వ‌బోతుంద‌న‌గానే ఓ మోడీ స‌ర్కారు ఎంతో గొప్ప‌ద‌ని అనుకోకండి. ఇక్క‌డే ఓ మెలిక ఉంది. ఆ సాయం కేంద్రం చేయ‌డం లేదు. ఏ రాష్ట్రంలోని మృతుల కుటుంబాల‌కు ఆ రాష్ట్రమే త‌మ విప‌త్తు స్పంద‌న నిధుల నుంచి ఈ సాయం చేయాల‌ని తాపీగా కేంద్రం సెల‌విచ్చింది. అలా చేయ‌డానికి రాష్ట్రాల‌కు అనుమ‌తిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసింది. అది కూడా అన్ని నిబంధ‌న‌ల ప్ర‌కారం కొవిడ్ మృతి అని తేలితేనే సాయం అందుతుంద‌ని కోర్టుకు కేంద్రం తెలిపింది.

ఇప్ప‌టికే క‌రోనా కారణంగా రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్ర‌మే ఉంది. పైగా కేంద్రం సాయం చేసి రాష్ట్రాల‌ను ఆదుకోవ‌డం లేదు. నిధులు కేటాయించ‌డం లేదు. అప్పులు చేసుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చిందే త‌ప్ప నేరుగా ఎలాంటి సాయం చేయ‌లేదు. ఒక‌వేళ అప్పులు చేస్తే అవి తిరిగి రాష్ట్రాలే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప‌రిస్థితుల్లో ఇప్పుడు క‌రోనా మృతుల కుటుంబాల‌కు కేంద్రం నేరుగా సాయం చేయ‌కుండా.. రాష్ట్రాల‌ను చేయ‌మ‌న‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌స‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కోర్టు చెప్పిన‌ట్లు సాయం చేసిన‌ట్లు అవుతుంది దాంతో పాటు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉండదు. మొత్తానికి కేంద్రం తెలివి చూసి రాష్ట్రాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. మ‌రి కేంద్రం చెప్పిన ప్ర‌కారం రాష్ట్రాలు న‌డుచుకుంటాయా? లేదా ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తాయా? అనేది చూడాలి. ఒక‌వేళ రాష్ట్రాలు త‌మ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించిన కేంద్రానికి వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు. ఎందుకంటే తాము చెప్పిన‌ప్ప‌టికీ రాష్ట్రాలే ఆ సాయం అందించ‌డం లేద‌ని కేంద్రం తిరిగి కోర్టుకు చెప్పే వీలుంటుంది.