Begin typing your search above and press return to search.

పెరిగిపోతున్న పోలవరం వివాదం!

By:  Tupaki Desk   |   15 Sep 2021 10:11 AM GMT
పెరిగిపోతున్న పోలవరం వివాదం!
X
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర వివాదం పెరిగిపోతోంది. ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ కూడా సానుకూలంగా ఉండాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కూడా ముంపు గ్రామాలున్నాయి. పై రెండు రాష్ట్రాల్లో సుమారు 8 గ్రామాల్లోని ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వం అడుగుతున్నా పై ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పైగా తమ భూభాగంలోని గ్రామాల ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వాలు ఇష్టపడటంలేదు.

పోనీ వివాదం పరిష్కారానికి జోక్యం చేసుకోమని కోరుతుంటే కేంద్రమూ ఇష్టపడటం లేదు. ఇది అంతర్రాష్ట్ర వివాదం కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టంగా చెప్పేసింది. అందుకనే సుప్రింకోర్టులో ఈ కేసు పరిష్కారం కాకుండా సంవత్సరాల తరబడి నలుగుతోంది. ఇదే విషయమై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తాజాగా మూడు రాష్ట్రాల జలవనరుల శాఖల కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. దీని ప్రకారం ఈనెల 20వ తేదీన ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది.

నోటీసులు అయితే ఇచ్చింది కానీ ఒడిస్సా నుండి ఉన్నతాధికారులు హాజరయ్యేది అనుమానమే. ఎందుకంటే వివాద పరిష్కారం విషయంలో మొదటినుండి కూడా ఒడిస్సా ఎలాంటి చొరవ చూపటంలేదు. ముంపు గ్రామాల్లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించటానికి ఇష్టపడటంలేదు. అందుకనే పై రెండు రాష్రంలోని శబరి, సీలేరు ఉపనదుల ద్వారానే పోలవరం ప్రాజెక్టుల్లోకి నీళ్ళొస్తున్నాయి.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బ్యాక్ వాటర్స్ కారణంగా రెండు రాష్ట్రాల్లోని 8 గ్రామాలు ముణిగిపోతాయి. అందుకనే జనాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఏపి కోరుతోంది. అలా కాకపోతే కనీసం ఉపనదులకు రక్షణ గోడలు కట్టడం రెండో పరిష్కారం. అయితే గోడలు కట్టాలంటే పై గ్రామాల్లోని జనాల అభిప్రాయం సేకరించాలి. ఇక్కడే ఒడిస్సా అడ్డుకుంటోంది. తమ భూభాగంలోని ముంపు గ్రామాల జనాల అభిప్రాయం సేకరించటానికి అంగీకరించేది లేదని చెప్పేసింది.

ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రస్తుతానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చొరవ చూపుతోంది. ఇదే సమయంలో సుప్రింకోర్టులో కేసులున్నా కరోనా వైరస్ కారణంగా విచారణ వాయిదా పడుతోంది. మరి ఈనెల 20 వ తేదీన జరిగే సమావేశానికి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరవుతారా అనేది సస్పెన్సుగా మారింది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.