Begin typing your search above and press return to search.

విదేశీ చదువులకు పెరుగుతున్న క్రేజ్.. ఆరేళ్లలో ఏకంగా..!

By:  Tupaki Desk   |   7 Feb 2023 1:00 PM GMT
విదేశీ చదువులకు పెరుగుతున్న క్రేజ్.. ఆరేళ్లలో ఏకంగా..!
X
విదేశాల్లో విద్యను అభ్యసించాలని ఆశిస్తున్న వారి సంఖ్యలో భారత్ లో రోజురోజుకు పెరిగిపోతోంది. విదేశాల్లో గ్రాడ్యూయేషన్.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారికి భారత్ లోనూ యమ డిమాండ్ ఉంది. విదేశాలకు భారతీయులు చదువు కోసం వెళుతూ అక్కడే మంచి ఉద్యోగం చూసుకొని సెటిల్ అవుతున్నారు. ఇలాంటి వారికి తమ బంధువుల్లో ఫుల్ క్రేజ్ దక్కుతోంది.

ఈ నేపథ్యంలో చాలామంది విదేశాల్లో చదువుకోవాలని ఆసక్తిని కనబరుస్తున్నారు. కొందరు స్టేటస్ సింబల్ కోసం విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసిస్తుంటే మరికొంతమంది కొత్త కోర్సులు.. మంచి ఉద్యోగాలు లభిస్తాయనే ఆశలతో విదేశాలకు పయనమవుతున్నారు. ఇలాంటి వారిని చూసి మరికొందరు అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

విదేశాల్లో చదువు పూర్తి చేసిన వారికి అక్కడే మంచి అవకాశాలు లభిస్తుండగా మన దేశంలోనూ అలాంటి వారికి మల్టీనేషనల్ కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. దీంతో చాలామంది భారతీయులు విదేశాల్లో చదువుకునేందుకు వలస వెళుతున్నారు. వీలైతే అక్కడే సెటిల్ అవుతున్నారు. కుదరకపోతే తిరిగి భారత్ కు వచ్చి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకుంటున్నారు.

మన దేశంలో చదివే వారి కంటే విదేశాల్లో చదివే వారికే కంపెనీలు సైతం పెద్దపీట వేస్తుండడంతో విద్యార్థులంతా విదేశీ మోజులో పడిపోతున్నారు. గత ఆరేళ్ల కాలంలో విదేశీ విద్య కోసం మన దేశం నుంచి 30 లక్షల మంది వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2017 నుంచి 2022 వరకు భారతీయ విద్యార్థులు 30 లక్షల వరకు దేశం విడిచి వెళ్లినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ లోక్ సభలో వెల్లడించింది.

ఈ గణాంకాలను ఒకసారి పరిశీలించినట్లయితే..! 2017 సంవత్సరంలో 4.54 లక్షల మంది.. 2018లో 5.17 లక్షల మంది.. 2019లో 5.86 లక్షల మంది.. 2020లో 2.59లక్షల మంది.. 2021లో 4.40లక్షల మంది.. 2022 సంవత్సరంలో 7.50లక్షల మంది చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొనడం గమనార్హం.

కాగా కరోనా పరిస్థితుల కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య తక్కువగా కన్పిస్తోంది. ఏది ఏమైనా ఈ గణాంకాలను పరిశీలిస్తే ప్రతియేటా విదేశీ విద్య కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అర్థమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.