Begin typing your search above and press return to search.

కోతల వేళ.. బోనస్ కింద ఒక్కో ఉద్యోగికి కోట్లను కట్టలుగా ఇచ్చిన కంపెనీ

By:  Tupaki Desk   |   31 Jan 2023 9:38 AM GMT
కోతల వేళ.. బోనస్ కింద ఒక్కో ఉద్యోగికి కోట్లను కట్టలుగా ఇచ్చిన కంపెనీ
X
ప్రపంచమంతా మాంద్యంతో ఉక్కిరిబిక్కిరి కావటం. తోపు సంస్థలుగా చెప్పే కంపెనీలు సైతం.. తమకే మాత్రం అవకాశం ఉన్నా.. ఉద్యోగుల మీద వేటు వేసేందుకు వీలుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాల్ని పీకేసి.. మరిన్ని ఉద్యోగాల్ని పీకి పారేసేందుకు వీలుగా ప్రయత్నాలు భారీగా సాగుతున్నాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో తమ వద్ద పని చేసే ఉద్యోగులు ఒక్కొక్కొరికి రూ.6 కోట్లు చొప్పున నోట్ల కట్టల్ని కట్టలు కట్టలుగా కట్టి మరీ పంపిణీ చేసిన ఉదంతం చైనాలో చోటు చేసుకుంది.

ఉద్యోగులకు ఇచ్చిన తాజా బోసన్ ను బ్యాంకు ఖాతాలో వేయకుండా.. ఒక కార్యక్రమాన్ని నిర్వహించి.. ఉద్యోగుల్ని పిలిచి మరీ నోట్ల కట్టల్ని చేతికి ఇచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనూహ్య రీతిలో కంపెనీ ఇచ్చిన భారీ మొత్తాన్ని చేతలతో తీసుకెళ్లలేక.. బ్యాగుల్ని తెచ్చుకొని.. అందులో డబ్బులు వేసుకొని మరీ వెళ్లిన విచిత్రమైన సీన్ కు చైనాలోని హెనాన్ మైన్ సంస్థ వేదికగా మారింది.

నిజానికి కరోనా దెబ్బకు చైనాలో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పలు కంపెనీలు ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇలాంటివేళ.. హెనాన్ మైన్ సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులకు భారీ నజరానా ఇవ్వాలని సంస్థ డిసైడ్ అయ్యింది. మిగిలిన కంపెనీల సంగతి ఎలా ఉన్నా.. తమ సంస్థ విపరీతమైన లాభాల్ని పొందటం.. దానికి కారణమైన ఉద్యోగులకు ఆ లాభాల్లో కొంత వాటా ఇవ్వాలని సదరు కంపెనీ డిసైడ్ అయ్యింది.

ఇందుకోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కంపెనీ సేల్స్ విభాగంలో ఉత్తమ పని తీరు కనబర్చిన ముప్ఫై మందికి పైగా ఉద్యోగులకు కలిపి రూ.73 కోట్ల మొత్తాన్ని నజరానాగా ఇచ్చారు. వీరిలో అత్యుత్తమ పని తీరు కనబర్చిన ముగ్గురు ఉద్యోగులకు మాత్రం రూ.6 కోట్ల చొప్పున ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మిగిలిన వారికి మాత్రం ఒక్కొక్కరికి రూ.1.20 కోట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. లేఆఫ్ లతో గడ్డు పరిస్థితుల్లో ఉన్న వేళ.. ఇలాంటి కార్యక్రమం ఒకటి జరటం ఆసక్తికరమే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.