Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ప్లీనరీ..హవా అంతా సిటీ నేతలదేగా

By:  Tupaki Desk   |   15 Oct 2021 8:30 AM GMT
టీఆర్ఎస్ ప్లీనరీ..హవా అంతా సిటీ నేతలదేగా
X
ప్రోగ్రాం ఏదైనా సరే.. భారీగా నిర్వహించటం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అలవాటే. తన అధికార నివాసంలో నిర్వహించే రివ్యూ సమావేశానికి సైతం భారీగా ఏర్పాట్లు చేయిస్తారు. అలాంటిది పార్టీ ప్లీనరీ కార్యక్రమాన్ని ఏ రేంజ్లో నిర్వహిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ నెల 25న నిర్వహించనున్న ప్లీనరీ బాధ్యత మొత్తం మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. దాదాపు 14 వేల మంది వరకు పార్టీ నేతలు.. కార్యకర్తలు హాజరయ్యే ఈ సమాశానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

తాజాగా దీనికి సంబంధించిన రివ్యూను నిర్వహించారు కేటీఆర్. ప్లీనరీకి అనుమతి ఉన్న నేతల్ని మాత్రమే లోపలకు అనుమతించేలా ప్లాన్ చేస్తున్నారు. మాదాపూర్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ ఐసీసీ)వేదికగా నిర్వహించే ఈ ప్లీనరీకి వచ్చే ప్రతి ఒక్కరి పేరును రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే లోపలకు అనుమతించనున్నారు. పక్కా ప్లాన్ తో ఈ కార్యక్రమాన్నినిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్లీనరీ నిర్వహణ బాధ్యత మొత్తం కేటీఆర్ తీసుకోగా.. తన బాధ్యతను తనకు అత్యంత సన్నిహితులైన హైదరాబాద్ మహానగర నేతలకు సింహభాగం అప్పజెప్పేయటం గమనార్హం. తాజాగా నిర్వహిస్తున్న ప్లీనరీ మొత్తం తన వర్గానికి చెందిన నేతలే చూసుకునేలా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ప్లీనరీ నిర్వహణ కోసం ఎంపిక చేసిన కమిటీల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

ఆహ్వాన కమిటీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఎంపీ రంజిత్ రెడ్డి.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బాధ్యతలు ఇచ్చారు. సభాస్థలి అలంకరణ బాధ్యతను.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. ఎమ్మెల్సీ నవీన్ కుమార్.. టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు.. పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైరర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి..మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు అప్పజెప్పారు. ప్రతినిధుల పేర్ల నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంభీపూర్ రాజుకు అప్పజెప్పారు.

ఇక.. కీలకమైన పార్కింగ్ కార్యక్రమం మొత్తాన్ని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద.. పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ కు అప్పజెప్పారు. ప్రతినిధుల భోజన ఏర్పాట్లు మొత్తాన్ని కుకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావుకు అప్పజెప్పారు. తీర్మానాల కమిటీ బాధ్యతనుపార్టీ నేతలు మధుసూదనాచారి.. పర్యాద క్రిష్ణమూర్తి.. మీడియా కమిటీ వ్యవహారాల్ని ఎమ్మెల్సీ భానుప్రసాద్.. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు అప్పజెప్పారు. ఇదంతా చూస్తే.. కేటీఆర్ కోర్ టీంకు కీలక బాధ్యతలు అప్పజెప్పినట్లుగా చెప్పక తప్పదు.