పెళ్లి పీటలపై కుప్పకూలిన వధువు.. అసలేమైందంటే?

Thu May 12 2022 16:00:04 GMT+0530 (IST)

The bride collapsed on the wedding

పెళ్లిమండపం ఘనంగా ముస్తాబైంది. వధువు వరుడు బంధువులతో కళకళలాడుతోంది. ఘనంగా ఏర్పాట్లు చేశారు. పల్లకీలో పెళ్లికూతురు రానే వచ్చింది. మహారాణిలా దిగింది. వరుడు ధీటుగా వచ్చి పెళ్లిమండపంలో కూర్చుకున్నారు. వేదమంత్రాలు మొదలయ్యాయి. సరిగ్గా తాళి కట్టే సమయం.. పెళ్లికి వచ్చిన వారంతా తలంబ్రాలు చల్లడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే సడెన్ షాక్.అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు పెళ్లిపీటలపైనే ఒక్కసారిగా కుప్పకూలింది. పెళ్లికొడుకు ఆమె తలపై జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. పెళ్లికూతురు కుప్పకూలడంతో ఆమె కళ్లు తిరిగి పడిపోయిందని భావించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ముఖంపై నీళ్లు చల్లినా లేవలేదు.

కానీ ఆస్పత్రికి వెళ్లేసరికే వధువు ప్రాణాలు వదిలేసింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమె బతకలేదు.

ఈ విషాద ఘటన విశాఖలోని మధురవాడలో జరిగింది. పెళ్లితంతు కూడా పూర్తి కావచ్చిన సమయంలో అనుకోని ఈ ఘటన జరగడంతో అంతా షాక్ లోనే ఉండిపోయారు.

ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే పెళ్లికూతురు సృజన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. వివాహ నేపథ్యంలో గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని బంధువులు తెలిపారు. కానీ ఇలా ప్రాణాలు పోతుందని భావించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

డీహైడ్రేషన్ వల్లే పెళ్లి కూతురు మరణం సంభవించిందా? ఈ ఎండలకే ఇలా జరిగిందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా ఈ ఎండల్లో అందరూ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.