పౌరసత్వ సవరణ బిల్లు కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ !

Wed Dec 04 2019 12:05:42 GMT+0530 (IST)

The Union Cabinet Clears the Citizenship Amendment Bill

వరుసగా రెండోసారి కూడా కేంద్రం లో పూర్తి మెజారిటీ తో  అధికారం లోకి వచ్చిన బీజేపీ వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అయోధ్య లో వివాదాస్పదమైన స్థలం పై తీర్పు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న బీజేపీ తాజాగా మరొక కీలక మైన నిర్ణయం తీసుకుంది.  కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఉదయం 9.30 గంటలకు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. మత ఘర్షణల కారణంగా పొరుగు దేశాల నుంచి పారి పోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన  ‘పౌరసత్వ సవరణ బిల్లు’ కు కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది.అలాగే  ఈ వారంలోనే ఈ బిల్లును పార్లమెంటు లో ప్రవేశ పెట్టబోతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ బిల్లు ప్రవేశపెడతారని సమాచారం. రక్షణ శాఖ మంత్రి రాజ్‌సింగ్ ఇప్పటికే ఈ బిల్లుపై సంకేతాలిచ్చారు. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఉభయ సభల్లో సభ్యులు అందరూ తప్పనిసరిగా సభకి  హాజరుకావాలని  మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం లో ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.  

బంగ్లాదేశ్ పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ వంటి దేశాల నుంచి వచ్చిన హిందువులు సిక్కులు బుద్ధులు జైనులు పార్శీలు క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించేలా 1955 నాటి పౌరసత్వ చట్టంలో సవరణలు చేస్తూ ఈ బిల్లును రూపొందించారు. ఏ రకమైన పత్రాలు లేక పోయినా భారత పౌరసత్వం కోసం  దరఖాస్తు చేసుకోవచ్చు. భారత్‌లో 11 ఏళ్లు తప్పని సరిగా నివసించి ఉండాలన్న నిబంధన గతంలో ఉండేది. కానీ దానిని ఇప్పుడు ఆరేళ్లకు తగ్గించినట్లు సమాచారం. అయితే ఈ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు ప్రతిపక్ష నేతల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే  పార్లమెంట్ లోనూ ఈ బిల్లును వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు చర్చించుకుంటున్నాయి.