జగన్ ప్రభుత్వ వినతిని పట్టించుకోని సుప్రీంకోర్టు!

Mon Feb 06 2023 12:35:07 GMT+0530 (India Standard Time)

The Supreme Court ignored Jagan's government's request!

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులకు అనుకూలంగా అమరావతి రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ)ను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులను చేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ రాజధాని అంశాన్ని విచారిస్తోంది. ఇప్పటికే ఒక విడత వాదనలు పూర్తయ్యాయి.



కాగా రాజధాని అంశాన్ని త్వరగా తేల్చాలని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తాజాగా లేఖ రాసిన సంగతి తెలిసిందే. త్వరగా విచారణకు రావడానికి రాజధాని కేసును మెన్షన్ లిస్టులో పెట్టాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు జగన్ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే సుప్రీంకోర్టు జగన్ ప్రభుత్వ వినతిని పరిగణనలోకి తీసుకోలేదు.

ఫిబ్రవరి 5 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు కూడా సుప్రీంకోర్టు  మెన్షన్ లిస్టులో రాజధాని కేసు ప్రస్తావన లేదంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం ఏంటనే అంశంపై న్యాయవాదుల్లో చర్చ జరుగుతోంది.

సోమవారం ఒకవేళ మెన్షన్ చేసినా కూడా విచారణకు సుప్రీంకోర్టు తేదీ ఇచ్చే అవకాశముందని న్యాయవాదులు అంటున్నారు. ఫిబ్రవరి 6న సోమవారం  సుప్రీంకోర్టు బెంచ్ ముందు మెన్షన్ చేయాల్సిన కేసుల్లో అమరావతి కేసు లేకపోవడం గమనార్హం. ఒక వేళ సాయంత్రంలోపు దీన్ని మెన్షన్ లిస్టులో చేర్చినా వెంటనే విచారణ జరపరని చెబుతున్నారు. విచారణకు ఇంకో తేదీని సుప్రీంకోర్టు ప్రకటిస్తుందని అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖతో సంబంధం లేకుండా మామూలుగా అయితే జనవరి 31నే విచారణ జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు బెంచ్ మీదకు ఈ కేసు విచారణకు రాలేదు. తర్వాత ఫిబ్రవరి 7న విచారణకు లిస్ట్ అయినట్లుగా కంప్యూటర్ జనరేటెడ్ లిస్టింగ్ లో కనిపించిందని అంటున్నారు.

అయితే కంప్యూటర్ జనరేటెడ్ లిస్టులో ఉన్నా ఏడో తేదీన కూడా బెంచ్ మీదకు వస్తుదో లేదో చెప్పడం కష్టమని సుప్రీంకోర్టు వర్గాలు తేల్చడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును త్వరగా విచారించాలని మెన్షన్ జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. ఫిబ్రవరి 6న కూడా ఈ కేసు మెన్షన్ లిస్టులో చోటు చేసుకోకపోవడంతో ఇక ఈ కేసు ధర్మాసనం ముందుకు ఎప్పుడు వస్తుందో ఎదురుచూడటం మినహా చేయగలిగిందేమీ లేదంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.