భార్య అవయవదానం చేయడానికి భర్త పర్మిషన్ అవసరం లేదు

Fri Jul 01 2022 05:00:01 GMT+0530 (IST)

The Delhi High Court clarified that the husband's permission is not necessary

పెళ్లైన మహిళ అవయవదానం చేయాలనుకుంటే దానికి ఆమె భర్త అంగీకారం అవసరం లేదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త అనుమతి కోరితే.. మహిళ తన సొంత శరీరంపై హక్కును కోల్పోయినట్టే అవుతుందని వ్యాఖ్యానించింది.సాధారణంగా కొందరు పెళ్లైన మహిళలు పుట్టింటికి వెళ్లాలంటే భర్త అత్తమామల పర్మిషన్ కోరుతుంటారు. వారి అంగీకారం లేనిదే ఏ పని చేయరు. అలాంటింది తన తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక ఏదైనా అవయవం కావాల్సి వస్తే.. కూతురు క్షణం కూడా ఆలోచించకుండా తనకి తోచిన సాయం చేస్తుంది. చివరకు తన అవయవాలను దానం చేయడానికి కూడా వెనకాడదు. కానీ మరోవైపు అలా చేయాలంటే దానికి భర్త అత్తమామలు ఏమంటారోనని ఆలోచిస్తుంది.

ఓ మహిళ తన రెండు కిడ్నీల్లో ఒకదాన్ని.. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి దానం చేసేందుకు ముందుకొచ్చారు. అయితే- ఆమె అవయవ దానం చేయడానికి భర్త అంగీకారం అవసరమని అతడి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని ఆస్పత్రి వర్గాలు షరతు పెట్టాయి.

దీంతో సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించారు. తాను భర్త నుండి దూరంగా ఉంటున్నానని తన కిడ్నీ దానం చేయడానికి ఆయన అనుమతి తీసుకోలేనని తన పిటిషన్లో పేర్కొన్నారు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 'మానవ అవయవాలు కణజాల మార్పిడి నిబంధనలు-2014'కు ఆయన అర్థవివరణ చెప్పారు. "అవయవదానానికి సంబంధించిన ఒక వ్యక్తి సొంతంగానే నిర్ణయం తీసుకుంటారు.

ఈ విషయంలో అతడు లేదా ఆమె నిర్ణయాన్ని ఉన్నత స్థాయిలో సమీక్షించి ఖరారు చేసే హక్కు చట్టపరంగా జీవిత భాగస్వామికి ఉండదు" అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అలా పర్మిషన్ తీసుకుంటే వారు వారి సొంత శరీరంపై హక్కును కోల్పోయినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు.