చర్చలకు కేంద్రం సిద్ధమే...కానీ షరతులు వర్తిస్తాయి: కేంద్రమంత్రి !

Wed Jun 09 2021 15:00:35 GMT+0530 (IST)

The Center is ready for talks ... but the conditions apply: Union Minister!

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం రైతుల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. రైతులు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి పంటలకు గిట్టుబాటు ధరలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రద్దు కుదరదని సవరణలు మాత్రం చేస్తామంటూ చెప్తుంది.ఈ క్రమంలో చర్చలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మళ్లీ స్పందించారు. అయితే షరతులు మాత్రం వర్తిస్తాయని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలకు సిద్ధంగా ఉందని అయితే సాగు చట్టాల రద్దు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించేందుకు మాత్రమే సిద్ధమంటూ కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం.. రైతులందరితో మాట్లాడిందని మళ్లీ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బిల్లుల రద్దు కాకుండా ఇతర అంశాలపై చర్చించేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉంటే వారితో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో మరొకరిని నియమిస్తారనే వార్తలపై పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అలాంటి వార్తలను కేంద్రమంత్రి తోసిపుచ్చారు. నాయకత్వంలో ఎలాంటి మార్పులకు అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. పూర్తిస్థాయిలో శివరాజ్ సింగ్ కొనసాగుతారని ఆయన పరోక్షంగా వెల్లడించారు.