దీదీ మీద పోటీకి దిగిన ఒకప్పటి శిష్యుడు

Sun Mar 07 2021 11:00:01 GMT+0530 (IST)

The BJP has fielded a former Canditate to compete with Didi

సేఫ్ గేమ్ అక్కర్లేదు. టఫ్ గేమ్ అయినా ఫర్లేదు.. పోరాడి సాధిద్దాం. అమితుమీ తేల్చేద్దామన్నట్లుగా ఉంటుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరు. దీదీగా అందరూ పిలిచే ఆమె.. తాజాగా జరుగుతున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యర్థుల సవాళ్లకు స్పందించటమే కాదు.. దేనికైనా రెఢీ అన్నట్లుగా ఆమె నిర్ణయాలు ఉంటున్నాయి. మమతను ఆమె రెగ్యులర్ గా పోటీ చేసే నియోజకవర్గాన్ని వదిలేసి.. నందిగ్రామ్ లో పోటీ చేసే సత్తా ఉందా? అని బీజేపీ సవాలు విసిరింది. నిజానికి అక్కడ ఆమెకు అంత బలం లేదు.అయినప్పటికి బీజేపీ వేసిన ఎత్తుకు ఓకే అంటూ.. ఆమె నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. తాజాగా ఆమెపై బరిలోకి దింపేందుకు బీజేపీ భారీ ప్లాన్ చేసింది. అందరి అంచనాలను నిజం చేస్తూ.. ఒకప్పుడు మమతకు అత్యంత ఆప్తుడిగా.. అనుంగ శిష్యుడిగా వ్యవహరించి.. ఈ మధ్యనే పార్టీ నుంచి జంప్ అయిన సుబేందును బరిలోకి నిలిపారు. ఒకప్పటి తన బాస్ ను యాభై వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని ఆయన చెబుతున్నారు.

తాను ఏ ప్రాంతంలో జరిగిన ఉద్యమంతో అధికారంలోకి వచ్చానో.. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే.. దీదీ బరిలోకి దిగిన నందిగ్రామ్.. సుబేందుకు సొంత గ్రామం. ఆయనకు మంచి పట్టున్న నియోజకవర్గం. స్థానికుడైన ఆయన్ను వదిలేసి దీదీని అక్కడి ప్రజలు నమ్ముతారా? అన్నది ప్రశ్న. అయితే.. పోరాటమే ఊపిరిగా చేసుకొని సాగే దీదీ.. తాజా ఎన్నికలు అత్యంత కఠినమైనవని చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఆమె కనుక తన సత్తా చాటితే.. బెంగాల్ రాజకీయాల్లో దీదీకి తిరుగు ఉండదని చెప్పక తప్పదు.