అదీ రోశయ్య రికార్డు అంటే... ?

Sat Dec 04 2021 21:00:01 GMT+0530 (IST)

That Is Rosaiah

ఆయన ఒక తరం. ఆయన ఒక పెద్దరికం. ఆయన ఒక బాధ్యత. ఆయన ఒక ఆర్ధిక క్రమశిక్షణ. తెలుగు వారి సొత్తుగా నిలువెత్తు రూపంగా భాసిల్లే కొణిజేటి రోశయ్య పంచెకట్టుతో అలరించేవారు. గుంటూరు జిల్లా ఘాటు కారం తిన్న ఆయనలో వెటకారం పాలు కూడా ఎక్కువే. ఎదుటి వారిని నొప్పించకుండా తాను సుతిమెత్తగా చేసే వెటకారం గుంటూరు మిర్చీ ఘాటుకు ధీటుగా ఉంటుంది. ఆయన ఉన్న సభలో రభసకు తావు లేదు. ప్రతిపక్షాన్ని కట్టడి చేయాలంటే రోశయ్య మార్క్ మాటల మంత్రం వాడాల్సిందే. ఆయన మైకు పుచ్చుకుని అధ్యక్షా అంటే చాలు అవతల వారికి ముచ్చెమటలు పట్టాల్సిందే.ఇదిలా ఉంటే రోశయ్య గురించి చెప్పుకోవాల్సింది మరోటి ఉంది. ఆయన బ్రహ్మాండమైన ఆర్ధిక మంత్రి. దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పదహారు బడ్జెట్లు ప్రవేశపెట్టిన గ్రేట్ మినిస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎంతమంది ఆర్ధిక మంత్రులు వచ్చినా ఆ శాఖ గురించి చెప్పుకుంటే రోశయ్య పేరునే పక్కన ఉంచాలనిపిస్తుంది. అంత చక్కగా ఆర్ధిక శాఖను ఆయన నిభాయించారు.

ఆయన ఆ శాఖ మంత్రిగా చెప్పిన మాటలు ప్రభుత్వాలకే కాదు కుటుంబ యజమానులకూ శిరోధార్యమే. పిండి కొద్దీ రొట్టె అనేవారు రోశయ్య. మన దగ్గర ఎంత ఉంటే దాంతోనే కధ నడపాలని నీతి చెప్పేవారు. హంగులకూ ఆర్భాటాలకూ పోరాదని ఆయన సూచించేవారు. ఆయన ఆర్ధిక మంత్రి ప్రసంగం తరతరాలకూ తరగని పాఠమే. మితిమీరి ఖర్చు చేసే వారికి ఒక గుణపాఠమే. నేను పిసినారిని అధ్యక్షా అంటూ ఆయన బడ్జెట్ ప్రసంగం చేస్తున్నపుడు నవ్వని వారు ఉండరు.

అవును ఉమ్మడి ఏపీ స్తోమత ఏంటో తాహతు ఏంటో అంచనా వేసి మరీ రోశయ్య బడ్జెట్ ని ప్రవేశపెట్టేవారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రతిపాదనలు పంపించినా కూడా ఒక దశలో తిరస్కరించేవారు. పెదవిని దాటిన పన్ను ఆదాయానికి మించిన అప్పూ ఎపుడూ ముప్పే అని రోశయ్య కంటే ఏ ఆర్ధిక వేత్త అంత చక్కగా వివరించగలరు. ఇక రోశయ్య మొత్తం 16 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అయితే ఆయన హయాంలో ఓవర్ డ్రాఫ్ట్ కి ఏపీ వెళ్ళిన సందర్భాలు బహు తక్కువ. అది కూడా ఎపుడో ఒకటి రెండు సార్లు తప్ప. అంటే అంత చక్కగా ఆర్ధిక వ్యవస్థను ఆయన నిభాయించేవారు అన్న మాట.

సొమ్ము ఉంటే గల్లాపెట్టెలో ఉండాలి. లేకపోతే దుకాణంలో సరకు అయినా కనిపించాలి. డబ్బు ఈ రెండు చోట్లా లేకుండా వేరే విధంగా పోతోంది అంటే అది దుబారావే అన్నది రోశయ్య మార్కు ఫిలాసఫీ. మొత్తానికి రోశయ్య వంటి ఆర్ధిక మంత్రులు ఏలిన చోట ఏపీ అన్నపూర్ణగానే ఉంది. కానీ ఇపుడు అప్పుల ఆంధ్రా అంటున్నారు. మరి దానికి కారణం ఏంటి అని ప్రతీ ఒక్కరూ చూసుకోవాలి. ఈ సమయంలో ఆర్ధిక మంత్రిగా రోశయ్య పాలించిన తీరుని జ్ఞప్తిని తెచ్చుకుంటే ఒక్క ఏపీనే కాదు దేశంలోని ఏ రాష్ట్రమైనా చక్కగానే ఉంటుంది. రోశయ్య ఈ విషయంలో బహు చక్కని మార్గదర్శి అని చెప్పకతప్పదు.