Begin typing your search above and press return to search.

ఈ వీడియో చూస్తే.. భయంతో ఒళ్లు జలదరించాల్సిందే

By:  Tupaki Desk   |   23 Feb 2021 1:30 AM GMT
ఈ వీడియో చూస్తే.. భయంతో ఒళ్లు జలదరించాల్సిందే
X
హైదరాబాద్ మహానగరం రోజురోజుకీ ప్రమాదాల రాజధానిగా మారుతోంది. నిబంధనల్ని పట్టించుకోకుండా.. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించటమే కాదు.. నిర్లక్ష్యం.. అతి వేగం లాంటి వాటితో ప్రాణాల మీదకు తెచ్చుకునేటోళ్లు నిత్యం పెద్ద ఎత్తున కనిపిస్తుంటారు. ఇలాంటి వారి వల్ల వారే కాదు.. కుటుంబ సభ్యులు సైతం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. టూవీలర్ మీద వెళ్లే వారు హెల్మెట్ ధరించటం.. కారులో ప్రయాణించే వారు సీటు బెల్టె పెట్టుకోవటం.. రోడ్ల మీద నడిచే వారు జాగ్రత్తగా నడవటం.. రోడ్లను దాటే వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని దాటటం లాంటి కనీస నిబంధనల్ని పాటించకపోవటం ఘోర ప్రమాదానికి కారణంగా మారుతుంది.

ఆదివారం మధ్యాహ్నం వేళ జీడిమెట్ల చింతల్ లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద వీడియోను చూస్తే ఒళ్లు జలదరింపునకు గురి కావటమే కాదు.. రోడ్ల మీద వెళ్లేటప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తి సెల్ ఫోన్ ధ్యాసలో ఉండి ఒక్కసారిగా పరిగెత్తటం.. అదే సమయంలో హెల్మెట్ పెట్టుకోకుండా అతి వేగంతో దూసుకొచ్చిన బైకర్ ఢీ కొట్టటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అయితే.. రోడ్డు ఒక కొస నుంచి మరో వైపునకు ఎగిరి పడటంతో పాటు.. సరిగ్గా కారుకింద పడ్డాడు. లక్కీగా సదరు కారు వేగంగా లేకపోవటంతో హటాత్తుగా బ్రేక్ వేశారు.

తీవ్రంగా గాయపడిన ఇద్దరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. హెల్మెట్ లేని కారణంగా తలకు తీవ్ర గాయమైనట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ను సైబరాబాద్ పోలీసులు ట్విటర్ లో షేర్ చేశారు. మొబైల్ ఫోన్ చూసుకుంటూ రోడ్డును దాటకున్నా ప్రమాదం జరిగేది కాదు. అదే సమయంలో వాయు వేగంతో బైకర్ దూసుకురాకున్నా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవారు కాదు. ఈ ఇద్దరు చేసిన తప్పునకు వారేకాకుండా.. వారి కుటుంబ సభ్యులు ఎంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందో గమనించారా? సో.. ఇల్లు విడిచి బయటకు వెళ్లే వేళ.. అప్రమత్తంగా ఉండటమే కాదు.. ట్రాఫిక్ నిబంధనల్ని పక్కాగా పాటించాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోవద్దు.