బిన్ లాడెన్ అంతానికి పదేళ్లు ..జో బైడెన్ కీలక వ్యాఖ్యలు !

Mon May 03 2021 10:00:02 GMT+0530 (IST)

Ten years to the end of bin Laden ..Joe Biden Key Comments!

ప్రపంచం మొత్తం వణికిపోయే అత్యంత భయంకరమైన ఉగ్రవాద సంస్థ అల్ఖైదా చీఫ్ అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్
పాకిస్తాన్ లోని అబోటాబాద్లో అమెరికా సైనిక బలగాల చేతుల్లో మరణించి 10 ఏళ్లు పూరైంది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబోటాబాద్ నగర శివార్లలో ఓ బంగళాలో నివసిస్తోన్న లాడెన్ ను 2011 మే 2వ తేదీన అమెరికా సైన్యానికి చెందిన నేవీ సీల్స్.. కాల్చి చంపింది. లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో గుర్తు తెలియని ప్రదేశంలో ఖననం చేసింది. ఆ ప్రదేశాన్ని కూడా ఎవరికీ చెప్పలేదు. లాడెన్ ఆచూకీని పసిగట్టడానికి రెండేళ్ల పాటు ప్రత్యేకం ఓ ఆపరేషన్ నిర్వహించింది అమెరికా.ఈ ఆపరేషన్ లో భాగంగా పని చేస్తూ అనేకమంది సైనికులు వీర మరణం పొందారు. ఈ ఆపరేషన్ లో అమరులైన సైనికులకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తాజాగా నివాళి అర్పించారు. లాడెన్ పై దాడికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్ నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. లాడెన్ పై చేపట్టిన ఆపరేషన్ విజయవంతం చేసే ప్రయత్నంలో పలువురు సైనికులు వీరమరణం పొందారని వారి త్యాగాన్ని మరువలేనిది అని అన్నారు. అబోటాబాద్పై దాడి సమయంలో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఆపరేషన్ మొత్తాన్నీ అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. సైనికుల అసమాన పోరాటాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని బైడెన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. న్యూయార్క్ ట్విన్ టవర్స్ పై దాడికి కారణమైన బిన్ లాడెన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని తాము అప్పట్లో ప్రజలకు హామీ ఇచ్చామని దాన్ని నెరవేర్చుకోవడానికి తీవ్రంగా శ్రమించామని చెప్పారు.ఓ సుదీర్ఘమైన యుద్ధాన్ని ముగించామని అల్ ఖైదాకు పుట్టినిల్లుగా భావించే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నామని చెప్పారు. అల్ ఖైదా ఇఫ్పుడు పూర్తిగా అంతరించి పోయే దశకు చేరిందని చెప్పారు. అయినప్పటికీ- ఆ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేయడానికి తాము కట్టుబడి ఉన్నామని  అమెరికా అధినేత మరోసారి స్పష్టం చేశారు.