ప్రాణం మీదకు వచ్చిన ప్రసాదం: తిన్న పది మంది తీవ్ర అస్వస్థత

Mon Jul 06 2020 07:00:01 GMT+0530 (IST)

Ten people fell sick after eating parsad at Bhagat Namdev Gurdwara

ప్రసాదం కొందరి ప్రాణం మీదకు వచ్చింది. అది తిన్న పది మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పంజాబ్ కు చెందిన రఘువీర్ సింగ్ తల్లి ఇటీవల మృతి చెందారు. దీంతో తల్లి జ్ఞాపకార్థం రఘువీర్ సింగ్ తన ఇంటిలో శనివారం సుఖ్మాణి సాహిబ్ ప్రార్థనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులు.. బంధువులు.. మిత్రులను ఆహ్వానించాడు. ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఇంట్లో అందరికీ ప్రసాదం పంపిణీ చేశారు.అనంతరం మిగిలిన ప్రసాదాన్ని తార్న్ తరణ్ గురుద్వారాకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఇది తిన్న కొద్దిసేపటికి 10 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే స్థానికులు వారిని అమృత్ సర్ లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అయితే అదే ప్రసాదం తిన్న ఇంట్లో వారందరికీ ఏమీ కాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కుటుంబసభ్యులను విచారణ చేస్తున్నారు.