కిల్ తెలుగుదేశం.. అంబటి సంచలన వ్యాఖ్యలు

Sat May 28 2022 21:14:05 GMT+0530 (India Standard Time)

Telugudesam .. Ambati Senstational Comments

ఎన్నికలు దూరంగా ఉన్నా పరిణామాలు మాత్రం వేడిగా ఉన్నాయి. అంబటి మాత్రం తనదైన శైలిలో ఇవాళ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ అధినేత బాబుపై మండిపడ్డారు.ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి చంద్రబాబు ద్రోహం చేశారని స్వార్థ రాజకీయాలు నడిపారు అని కానీ జగన్ ఆ విధంగా తన కుటుంబం విషయమై నడుచుకోలేదని అన్నారు. ఇదే సందర్భంలో బీసీలను తాము ఏ విధంగా ఆదుకున్నదీ అన్నది మహానాడు వేదికపై చెప్పాలని అధికారంలో లేమని బాధ తప్ప ప్రజల కోసం చేసింది చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహానాడు సందర్భంగా అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. వైసీపీ ని ఉద్దేశించి టీడీపీ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తున్నారు. ప్రజలంతా తమకు బ్రహ్మరథం పడుతున్నారని జయహో జగన్ అని అంటున్నారని అంటూతమ పాలన బేషుగ్గా ఉందని చెబుతూ ఇవాళ అధికార పార్టీ సభ్యులు తమ తరఫు వాదన వినిపిస్తున్నారు.

అదేవిధంగా పోలవరానికి సంబంధించి టీడీపీ ఏం చేసిందని చెబుతూనే టీడీపీ అనే విష సర్పం కొన ఊపిరితో ఉందని దానిని చంపేయాలని మంత్రి అంబటి తీవ్ర ఉద్రిక్తతలకు తావిచ్చే మాటలు అన్నారు.

ఒంగోలులో మహానాడు జరుగుతున్న సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ టీడీపీ పై ఫైర్ అయ్యారు. కిల్ తెలుగు దేశం సేవ్ ఆంధ్రా పాలిటిక్స్ అన్న నినాదాన్ని తాము వినిపిస్తున్నామని అంటూ మ రో వివాదానికి తెర లేపారు. నిన్నటి మహానాడు వేదికగా అధినేత చంద్రబాబు వినిపించిన క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంపై అంబటి రాంబాబు  స్పందించారు. అదేవిధంగా కొన్ని రాజకీయ పరిణామాలను సైతం తన మీడియా మీట్ లో విశ్లేషించారు.

మహానాడు ను ఉద్దేశించి బీసీలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకూ ఎస్సీలకూ ఎస్టీలకూ తెలుగుదేశం పార్టీ ద్రోహం చేసిన పార్టీ అని ఘాటుగా విమర్శించారు. కోనసీమ ఘటనకు సంబంధించి కూడా ఆయన స్పందించారు. ఒక దళిత మంత్రి ఒక బీసీ ఎమ్మెల్యే ఇళ్లను నిరసనకారులు సంఘ విద్రోహ శక్తులు తగులుబెట్టిన ఘటనను ఎందుకు ఖండించరు అని ప్రశ్నించారు. తాము చేపట్టిన బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోందని కానీ ఓ వర్గం మీడియా దానిని తప్పుగా చూపిస్తూ అస్సలు ఆదరణే లేదని చెప్పడం భావ్యంగా లేదని అన్నారు.