Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగుకి అగ్రస్థానం .. ఏ విషయంలో అంటే ?

By:  Tupaki Desk   |   16 Jun 2021 9:30 AM GMT
అమెరికాలో తెలుగుకి అగ్రస్థానం .. ఏ విషయంలో అంటే ?
X
అమెరికాలో శరవేగంగా పెరుగుతున్న భాష ఏమిటో ఊహించగలరా, ఇంగ్లీష్ లేదా ఇతర భాషల పేర్లు చెబితే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మన మాతృభాష తెలుగు అమెరికాలో వేగంగా పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి చాలామంది యువత అమెరికాకు వెళ్తున్నారు. ఇక్కడి యువత సాఫ్టువేర్, ఇంజినీరింగ్ చదువు, ఉపాధి కోసం అమెరికా వెళ్తున్నారు. అక్కడ తెలుగు మాట్లాడే వారి సంఖ్య గత ఏడేళ్లలో 86 శాతం పెరిగింది. అమెరికాలో ఇంగ్లీష్ కాకుండా ఎక్కువగా మాట్లాడే టాప్ 20 భాషల్లో తెలుగు ముందు వరుసలో ఉంది. అమెరికా థింక్ టాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో 8 కోట్ల 40 లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అత్యధికులు మాట్లాడే నాలుగో భాష తెలుగు. ఇదే విధంగా అమెరికాలోనూ ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలు మాట్లాడేవారిలో తెలుగు మాట్లాడేవారు 4 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు. ఇంట్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ కాకుండా ఎంత మంది ఏయే భాషలు మాట్లాడుతున్నారు అనే విషయంపై అమెరికాలో అధ్యయనం చేశారు. 2010 లో తెలుగు మాట్లాడే వారితో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపు సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని తేల్చిన అధ్యయనం. అమెరికాలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు భారీ డిమాండ్ ఉంది. అమెరికాలో ఉన్న వారిలో చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చినవారే కావడం విశేషం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పుడు 800కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.

అమెరికాకు వస్తున్న తెలుగు ఐటీ నిపుణుల సంఖ్య భారీగా ఉంటోంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్ పరిశ్రమకు హైదరాబాద్ భారతదేశంలోనే ఒక మేజర్ హబ్‌. తెలుగు మాట్లాడే అమెరికన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఐటీ నిపుణులను తమ సంస్థల్లో నియమించుకుంటున్నారు. భారతీయులు హెచ్-1బి వీసా స్కీమ్‌ ద్వారా ప్రయోజనం దక్కుతోంది. ఏటా టెక్నాలజీ రంగం వైపు వచ్చే కొన్ని వేల మంది విదేశీయులు వర్క్ వీసాల పైనే వస్తారు. వీటిలో 70 శాతం భారతీయులకే దక్కుతున్నాయి తెలుగు సినిమా, ఇంటర్నెట్‌తో పాటు అమెరికాలోని తెలుగు సంఘాలు భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నాయి. తెలుగు సంఘాలు మొదలుపెట్టిన ‘మన బడి’, ‘పాఠశాల’ లాంటి కార్యక్రమాలు తెలుగు భాషను అక్కడ వేగంగా వ్యాప్తి చెందేలా చేస్తున్నాయి. కొన్ని దేవాలయాల్లో తెలుగు నేర్పుతున్నారు. అమెరికన్ కుర్రాళ్లు తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగువాళ్లు స్థానిక రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు. ‘తానా’, ఆటాలాంటి సంస్థలు తెలుగు భాష వ్యాప్తికి తమవంతు కృషి చేస్తూ వస్తున్నాయి. అమెరికాలో ఎక్కువమంది మాట్లాడే మాతృభాషల్లో మూడోది తెలుగు భాష. అక్కడ భారతదేశానికి చెందిన భాషల్లో ఎక్కువగా హిందీ మాట్లాడేవారు ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, తెలుగు మూడో స్థానంలో ఉన్నాయి. అమెరికాలో నివసిస్తున్నవారిలో ఇంటివద్ద సుమారు 3,65,566 మంది తెలుగులోనే మాట్లాడుతారని సర్వే తేల్చింది.