Begin typing your search above and press return to search.

నీటి లొల్లిపై ఢిల్లీకి పిలుపు.. తెలుగు రాష్ట్రాల వాదన ఇదే!

By:  Tupaki Desk   |   12 Sep 2021 9:41 AM GMT
నీటి లొల్లిపై ఢిల్లీకి పిలుపు.. తెలుగు రాష్ట్రాల వాదన ఇదే!
X
రాష్ట్ర విభజన తర్వాత నీటి లొల్లి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు వచ్చినా.. గతానికి భిన్నంగా ఈ మధ్యన రెండు రాష్ట్రాల మధ్య గొడవ పెద్దదైంది. అదెంతవరకు వెళ్లిందంటే.. నీటి వివాదాలకు పరిష్కారంగా కేంద్రం ఇప్పటికే జారీ చేసిన గెజిట్ లోని అంశాల్ని సైతం తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసే పరిస్థితి. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ తో పాటు కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్‌లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్‌ అయ్యర్‌లతో కలిపి వీడియో కాన్ఫెరెన్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యల్ని చర్చించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ఢిల్లీలో రేపు (సోమవారం) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

వాస్తవానికి కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సంబంధించి గత నెల మూడున.. తొమ్మిదిన బోర్డుల సమన్వయ కమిటీ నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం గైర్హాజరైంది. అదే సమయంలో గత నెల 16న నిర్వహించిన ఉమ్మడి బోర్డుల సమావేశానికి తెలంగాణ సర్కారు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాల్ని వారు వివరించారు. ఇదిలా ఉంటే.. ఏపీ సర్కారు గెజిట్ అమలులోపలు సవరణల్ని సూచించింది. అదే సమయంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నామని పేర్కొంది. అయితే.. తాము కొన్ని సవరణల్ని ప్రతిపాదిస్తున్నామని స్పష్టం చేసింది.

గెజిట్ అమలుపై రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాల్ని చూస్తే.. అందులో మొదట ఏపీ ప్రభుత్వం వినిపిస్తున్న వాదనల్ని చూస్తే..

- కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకుని, నిర్వహించాలి.

- మిగిలిన ప్రాజెక్టుల్లో రోజువారీనీటి వినియోగాన్ని రెండు రాష్ట్రాల నుంచి సేకరిస్తే సరిపోతుంది.

- ఈ విధానంలో కృష్ణా బోర్డుపై భారం తగ్గుతుంది.

- ఉమ్మడి ప్రయోజనాలతో ఏ మాత్రం సంబంధం లేని ప్రకాశం బ్యారేజీ.. ధవళేశ్వరం బ్యారేజీలను బోర్డు పరిధి నుంచి తప్పించాలి.

- మాచ్ ఖండ్.. సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాలను గోదావరి బోర్డు నుంచి తప్పించాలి.

తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల్ని చూస్తే..

- ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను అనుమతి ఉన్నట్లుగానే గుర్తించాలి

- రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులనే కొత్త ప్రాజెక్టులుగా పేర్కొనాలి.

- విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ లో పేర్కొన్న హంద్రీ-నీవా.. గాలేరు -నగరి.. తెలుగుగంగ.. వెలిగొండ ప్రాజెక్టులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు గుర్తించాలి.

- అనుమతి లేని ప్రాజెక్టులకు ఆర్నెల్లలోపు అనుమతి తెచ్చుకోవాలన్న నిబంధనను సడలించాలి.

- నీటి కేటాయింపులు తేలే వరకు గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలి

- గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు అనుమతి లేని ప్రాజెక్టులుగా ముద్ర వేస్తే వాటికి రుణాలు తెచ్చుకోవటం సమస్యగా మారుతుంది.

ఈ రెండు రాష్ట్రాల వాదనల్ని చూస్తే.. ఎవరికి వారు వారి రాష్ట్ర ప్రయోజనాలను తప్పించి.. ఇచ్చిపుచ్చుకునే తీరు ఎక్కడా కనిపించదు. తమ ప్రయోజనాల్ని వదిలిపెట్టుకోవటానికి ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో.. ఎవరికి వారు తమ పంతాన్ని నెగ్గించుకోవాలన్నట్లుగా వారి తీరు ఉంది. రెండు రాష్ట్రాలు ఎవరికి వారు పట్టుదలకు పోతే.. కేంద్రం మాత్రం ఏం చేయగలదన్నది ప్రశ్న. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆర్నెల్ల లోపు అనుమతులు తెచ్చుకోవాలన్న కీలక నిబంధనను సడలించాలని కోరుతోంది. ఒకవేళ.. లెక్క తేలే నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తే పరిస్థితి ఏమిటి? అన్నది మరో ప్రశ్న. ఇలా ఎవరికి వారు తమ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్న వేళ.. కేంద్రం దీనికి ఏలాంటి సమాధానాల్ని ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. నీటి లొల్లి లెక్క తేల్చేందుకు ఉన్నతాధికారుల స్థాయిలో కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరుగా భేటీ అయితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్లే.. ఇరువురు ముఖ్యమంత్రుల్ని ఒక చోట కూర్చొబెట్టి చర్చలు జరుపుకునేలా కేంద్రం ప్రయత్నిస్తుందా? అన్నది మరో ప్రశ్న. మొత్తానికి పెద్ద మనిషిలా వ్యవహరిస్తున్న కేంద్రం.. నీటి పంచాయితీ లెక్క ఏ మేరకు తేలుస్తుందన్నది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.