Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి మనమ్మాయ్ అవుట్

By:  Tupaki Desk   |   4 Dec 2019 6:42 AM GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి మనమ్మాయ్ అవుట్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవటం అంటే ప్రజల మద్దతు ఒక్కటే సరిపోదు. వందలాది కోట్ల రూపాయిల అవసరం ఉంటుంది. ప్రజాబలం ఉన్నా ధన బలం లేకుంటే పోటీ నుంచి తప్పుకోవాల్సిందే. తాజాగా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతసంతతికి చెందిన కమలా హ్యారీస్ తప్పుకుంటున్నట్లుగా వెల్లడించి సంచలనంగా మారారు.

ఎన్నికల బరి నుంచి తాను ఎందుకు తప్పుకుంటున్న విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పేశారు. తన మద్దతుదారులకు.. తనను అభిమానించే వారిని ఉద్దేశించి ఆమె ఒక ట్వీట్ చేశారు. ఇది చాలా విచారకరం.. నేనీ రోజున నా ప్రచారాన్ని నిలిపివేస్తున్నా.. అయితే.. ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాను. నేను ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు.

తాను తీసుకున్న నిర్ణయం కష్టతరమైనద్న ఆమె.. ఆర్థిక ఒత్తిళ్లతోనే అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకన్నట్లు చెబుతున్నారు. తాను బిలీయనీరును కాదని.. సొంత ప్రచారానికి నిధులు సమకూర్చుకునే పరిస్థితుల్లో లేను కాబట్టి.. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.

ప్రచారం సాగుతున్న కొద్దీ మనం పోటీ పడటానికి అవసరమైన నిధుల్ని సేకరించటం కష్టంతో కూడుకున్న పనిగా ఆమె అభివర్ణిస్తున్నారు. ఆమెకు పోటీగా బిలియనీర్ కమ్ న్యూయార్క్ మేయర్ మైక్ బ్లూమ్ బర్గ్ బరిలోకి వచ్చిన నేపథ్యంలో ఆమె డెమొక్రటిక్ అభ్యర్థిగా వైదొలగాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

బ్లూమ్ బర్గ్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్లుగా ప్రకటించిన తర్వాత కమలా హ్యారీస్ కు మద్దతు కాస్త తగ్గింది. దీంతో.. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. చాలా బాధ కలిగించే అంశం.. మేం నిన్న కోల్పోతున్నాం కమలా? అంటూ ఎక్కెసం ఆడిన ఆయన మాటలకు కమలా చురకలు అంటించారు. మిస్టర్ ప్రెసిడెంట్.. మీరు చింతించాల్సిన అవసరం లేదు.. మీపై జరిగే అభిశంసన విచారణలో కలుస్తానంటూ ధీటుగా బదులిచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఫోన్ సంభాషణల విషయంలో ట్రంప్ అభిశంసన విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కమలా ట్రంప్ కు తన మాట పంచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.