Begin typing your search above and press return to search.

రాత్రి కర్ఫ్యూకు తెలంగాణ రెఢీ.. నేడే అధికారిక ప్రకటన!

By:  Tupaki Desk   |   17 Jan 2022 5:37 AM GMT
రాత్రి కర్ఫ్యూకు తెలంగాణ రెఢీ.. నేడే అధికారిక ప్రకటన!
X
మూడో వేవ్ ముంచేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. పండుగ తర్వాత మరింత ఎక్కువ కానున్నాయన్న అంచనాలు వినిపిస్తున్న వేళ.. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలన్న వినతులు వినిపిస్తున్నాయి. దీంతో.. ఇష్టం లేకున్నా.. నలుగురి కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదన్నట్లుగా పరిస్థితి మారింది. రాత్రిపూట కర్ఫ్యూతో కేసులు తగ్గే అవకాశం లేకున్నా.. కనీసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న సంకేతాల్ని పంపే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూడో వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఏపీలోనూ రాత్రిపూట కర్ఫ్యూను కొద్దిరోజులుగా అమలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఆంక్షల్ని విధించేందుక సిద్ధమవుతోంది.మూడో వేవ్ తీవ్రత ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుందన్న అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అప్పటివరకు అమలు చేసేలా ఆంక్షల్నిఅమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఇందులో రాత్రిపూట కర్ఫ్యూకు సంబంధించిన నిర్ణయం తీసుకునే వీలుందన్నమాట బలంగా వినిపిసస్తోంది.

రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటం.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్లే.. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్న మాట వినిపిస్తున్న వేళ.. ఆ మాట రాకుండా ఉండేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాత్రి 9 గంటలకు లేదంటే 10 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూను విధించే అవకాశం ఉందంటున్నారు.

ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో.. రాత్రి వేళ థియేటర్లు సాయంత్రం షో పూర్తి అయ్యే సమయానికి కర్ఫ్యూ విధించాలన్న యోచనలో ఉన్నట్లుచెబుతున్నారు. ఇప్పటికే స్కూళ్లు..కాలేజీలకు సెలవులు ఇచ్చేసి.. ఆన్ లైన్ చదువులకు ఓకే చెప్పేయటం తెలిసిందే. కరోనా స్థితి గతుల మీద వైద్య ఆరోగ్య శాఖ సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది. వారి నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడి ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్న వేళ.. కట్టడి చర్యల్లోభాగంగా రాత్రి కర్ఫ్యూను విధించటం ఖాయమంటున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.