Begin typing your search above and press return to search.

దేశంలోనే తొలిసారి.. తెలంగాణలో మరో కొత్త వేరియంట్ కేసు.. కలకలం

By:  Tupaki Desk   |   24 May 2022 4:30 PM GMT
దేశంలోనే తొలిసారి.. తెలంగాణలో మరో కొత్త వేరియంట్ కేసు.. కలకలం
X
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తన రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. ప్రస్తుతం చైనా, ఉత్తరకొరియాలను అల్లాడిస్తోంది. దేశంలో టీకాలు పంపిణీ చేయడంతో పెద్దగా వేరియంట్ ప్రభావం చూపించడం లేదు. కానీ కొత్త వేరియంట్లు మాత్రం పుట్టుకొస్తూ ఆందోళనకు కారణమవుతున్నాయి.

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ బీఏ5 కేసు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నమోదైంది. నాలుగు రోజుల కిందే బీఏ4 కేసు నమోదుకాగా.. ఈ రెండు వేరియంట్ కేసులు దేశంలో తొలిసారి మన దగ్గర రికార్డయ్యాయి.

న్యాయసలహాదారుగా పనిచేస్తున్న ఒక సీనియర్ సిటీజన్ లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈనెల 12న ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ గా తేలింది. ఈ క్రమంలోనే వైద్యశాఖ కొన్ని నమూనాలను జన్యు విశ్లేషణలకు గాంధీ ఆస్పత్రి ల్యాబ్ కు పంపింది. ఇందులో వృద్ధుడి శాంపిల్ కూడా ఉంది.

ఈ క్రమంలోనే వృద్ధుడికి సోకింది బీఏ5 అనే కొత్త వేరియంట్ అని తేలింది. దీనిపై తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ప్రకటన జారీ చేశారు. ఆయనకు ఎటువంటి ప్రయాణ చరిత్ర లేదని.. ఆరోగ్యం నిలకడగా ఉందని.. తెలంగాణలో ఈ కొత్త వేవ్ పుట్టుకొచ్చిందని వివరించారు. అయితే కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశం లేదని మాత్రం హామీ ఇచ్చారు.

నాలుగు రోజుల కిందట కూడా తెలంగాణలోనే బీఏ 4 వేరియంట్ కొత్త కరోనా రకం దేశంలో మనదగ్గరే నమోదైంది. దీనిపై కూడా డీఈ శ్రీనివాసరావు మాట్లాడారు. బీఏ4, బీఏ5 ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అని వెల్లడించారు. కాబట్టి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండదన్నారు.

అయితే ఈ వైరస్ వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉందని.. కొన్ని దేశాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పుకొచ్చారు.