ఆర్టీసీ సమ్మె ట్విస్ట్ ఇచ్చిన కోర్టు!

Thu Oct 10 2019 17:37:29 GMT+0530 (IST)

Telangana high court postpones trials on tsrtc employees

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కేసును ఈనెల 15కు వాయిదా వేసింది హైకోర్టు. గురువారం హైకోర్టులో ఇటు ప్రభుత్వం తరుపు న్యాయవాది రామచందర్ రావు - ఆర్టీసీ కార్మిక సంఘాల తరుపున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది కోర్టును కోరారు. ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది రామచందర్ రావు సమ్మెను విరమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇరువురి వాదలను విన్న హైకోర్టు కేసును ఈనెల 15కు వాయిదా వేసింది. పూర్తి వివరాలతో మరోసారి కౌంటర్ దాఖాలు చేయాలని ఆదేశించింది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సమ్మె ఈనెల 15వ తేది వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టమవుతుంది.గురువారం హైకోర్టులో ఇరువురి న్యాయవాదులు ఎవరి వాదనలు వారు కోర్టుకు వినిపించారు. ఆర్టీసీ కార్మికుల తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది రచనారెడ్డి కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ముందుగానే నోటీసులు ఇచ్చారని కానీ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడంతోనే సమ్మె బాట పట్టారని హైకోర్టుకు తెలిపారు. అదే విధంగా ప్రభుత్వానికి కార్మికులు నెల రోజుల ముందే సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేయాల్సి వస్తుందని - దీనికి తోడు  సెప్టెంబర్ 3 - 24 - 26 తేదీల్లో కూడా నోటీసులు ఇచ్చారన్నారు.

కార్పోరేషన్ ఫండ్స్ రూ.545 కోట్లతో ఇతర రాయితీలు ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కార్మికులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కు ప్రభుత్వం  ఎలాంటి చర్యలు తీసుకోలేదని అందుకే సమ్మెకు వెళ్ళాల్సి వచ్చిందని - ఇకనైనా సమస్యలు పరిష్కరిస్తే వెంటనే సమ్మె విరమిస్తారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ప్రతిగా  ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ రామచందర్ రావు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి సమయం ఇవ్వాలని కోరినా వారు వినిపించుకోలేదని కోర్టుకు తెలిపారు.

కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు గత నెల 29వ తేదీన సునీల్ శర్మ ఆధ్వర్యంలో కమిటీ నియమించడం జరిగిందని తెలిపారు. కమిటీ నిర్ణయం తీసుకోకముందే.. కార్మికులు సమ్మెలోకి వెళ్లారన్నారు. సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈనెల 15కు కేసును వాయిదా వేసింది. సో హైకోర్టు ఆదేశాలతో ఇటు ప్రభుత్వం అటు కార్మిక సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే..!