ఎటూ తేల్చని కేంద్రం.. ఆందోళనలో రైతాంగం

Thu Nov 25 2021 08:00:02 GMT+0530 (IST)

Telangana farmers are worried on rice collection

బియ్యం సేకరణపై కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ రైతాంగం ఆందోళనలో ఉంది. ఈ విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులకు కేంద్రం నుంచి ఎటువంటి హామీ లభించలేదు. అయితే ఇకపై ఉప్పుడు బియ్యం కొనేది లేదని మాత్రం మరోసారి కుండబద్దలు కొట్టింది.ఇక ప్రస్తుత వానా కాలం పంట ఎంతమేరకు కొనుగోలు చేస్తామనేది కూడా తేల్చి చెప్పలేదు. సోమవారం వానాకాలం యాసంగి పంట మొత్తం 150 లక్షల టన్నులు కొనాలని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతాధికారులు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంషు పాండేను కోరారు.

అయితే మంగళవారం 100 నుంచి 120 లక్షల టన్నుల బియ్యం ఎఫ్ సీ ఐ సేకరించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై శుక్రవారం మరోసారి సమావేశమై కోటాపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీలో మంగళవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ లతో రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఉన్నతాధికారుల బృందం విడివిడిగా దాదాపు మూడున్నర గంటల పాటు సుధీర్గంగా భేటీ అయింది.

కేటీఆర్ సహా ముగ్గురు మంత్రులు రాజ్యసభ లోక్ సభ పక్షనేతలతో పాటు 10 మంది ఎంపీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారుల బృందం ఈ చర్చల్లో పాల్గొంది. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది.

ఉప్పుడు బియ్యం చరిత్ర కనుమరుగేనా?

‘'వానాకాలంలో సాగైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని యాసంగి పంట కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రులను కేటీఆర్ కోరారు. సీఎం కేసీఆర్ చేసిన డిమాండ్ మేరకు ధాన్యం కొనుగోలు పరిమితిని మరింతగా పెంచుతామని కేంద్రం హామీ ఇచ్చింది’’ అని సీఎంవో ప్రకటన చేసింది. కాగా తెలంగాణ వరిసాగు విస్తీర్ణం మీద కేంద్రం ఒక స్పష్టతకు వచ్చింది.

62 లక్షల 13 వేల ఎకరాల్లో తెలంగాణ రైతులు వరిధాన్యాన్ని సాగుచేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ వరి సాగు విస్తీర్ణాన్ని 58 లక్షల 66 వేల ఎకరాలుగా కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది.

అయినా ఎంత వరిధాన్యాన్ని కొనే అంశాన్ని కేంద్రం పెండింగులో పెట్టింది. ఈనెల 26వ తేదీన మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ మరోసారి సమావేశం కానున్నారు.

వార్షిక టార్గెట్ ముందస్తు ప్రకటనపై హర్షం

ప్రతి ఏటా ఎంత ధాన్యం కొంటామనే విషయంలో వార్షిక ధాన్యం కొనుగోలు టార్గెట్ ను ముందస్తుగానే ప్రకటించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇది దేశ రైతాంగానికందరికీ వర్తింపచేయాల్సిన విలువైన సూచనగా కేంద్రం అభిప్రాయ పడింది.

మంత్రి వర్గ బృందంతో చర్చల సందర్భంగా ఈ మేరకు సీఎం కేసిఆర్ సూచనను కేంద్రం అభినందించింది. ఇకనుంచి వార్షిక వరిధాన్యం కొనుగోలు వివరాలను ముందస్తుగానే ప్రకటిస్తామని రానున్న సంవత్సరం నుంచే ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్ఠం చేసింది.

అప్పాయింట్మెంట్ లొల్లి

ప్రధాని హో మంత్రి సహా పలువురు మంత్రులను కలిసేందుకు ఆదివారం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ .. అపాయింట్మెంట్లు ఏమీ తీసుకోలేదని సోమవార మంతా చర్చ సాగింది. ఇదే అనుభవం మంగళవారం కేటీఆర్ కూ ఎదురైంది. కేంద్ర ఆహార శాఖ అధికారులను కలిసిన అనంతరం కేటీఆర్ తదితరులు కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయెల్ తో సమావేశానికి ప్రయత్నించారు.

అయితే అమెరికా వర్తక ప్రతినిధులతో సమావేశంలో ఉన్న పీయూష్ కు కేటీఆర్ పలుసార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది. తొలి సారి ఫోన్ చేసినప్పుడు అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చారు? నేనే ఆఫీసుకు వచ్చాక చెబుతానని చెప్పాను కదా?’’ అని ఆయన అన్నట్లు తెలిసింది. రెండోసారి ఫోన్ చేసినప్పడు అరగంటలో వస్తానని హామీ ఇచ్చారు. చివరకు సాయంత్రం 6.45 సమయంలో వచ్చి కేటీఆర్ తదితరులతో సమావేశమయ్యారు.

ఈ భేటీ గంటపైగా సాగింది. మధ్యలో పీయూష్.. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో కేటీఆర్ ను ఫోన్ లో మాట్లాడించారు. పీయూష్ కేటీఆర్ సమావేశం ముగిశాక.. అదే కార్యాలయంలో ఉన్న తోమర్ తో సమావేశమయ్యారు.

మూడు వినతులు

నిరుడు మిగిలిన 5.25 లక్షల టన్నుల పార్బాయిల్డ్ బియ్యాన్ని సేకరించాలని ఈ ఏడాది రాష్ట్రంలో ఉత్పత్తి కానున్న ధాన్యంలో 90 శాతం సేకరించడంతో పాటు మొత్తం సంవత్సర కోటా ఒకేసారి ఖరారు చేయాలన్న మూడు వినతులతో కేటీఆర్ తదితరులు కేంద్ర ఆహార మంత్రిని కలిశారు.