Begin typing your search above and press return to search.

ట్రయాంగిల్ ఫైట్ జరగాలి : గులాబీ జెండా ఎగరాలి ....

By:  Tupaki Desk   |   28 Jun 2022 4:28 AM GMT
ట్రయాంగిల్ ఫైట్ జరగాలి : గులాబీ జెండా ఎగరాలి ....
X
తెలంగాణా సీఎం కేసీయార్ ఒక విధంగా బేఫికర్ గానే ఉన్నారు అని భావించాలి. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు అన్న సామెత మాదిరిగా తెలంగాణాలో అటు చూస్తే కాంగ్రెస్ ఇటు చూస్తే బీజేపీ రెచ్చిపోయి మరి తెగ పోటీ పడుతున్నాయి. ఈ భీకర పోరులో ముచ్చటగా మూడవసారి టీయారెస్ గెలిచి తీరడం ఖాయమని ఆయన లెక్కలేస్తున్నారు.

నిజంగా జరిగేది కూడా అదే అని రాజకీయ గణితం కూడా తేల్చిచెబుతోంది. ఇప్పటికి రెండు సార్లు కేసీయార్ ని జనాలు ఆదరించారు. మొదటి సారి తెలంగాణా వాదంతో ఆయన విజయం సాధించారు. రెండవసారి వ్యతిరేకత ముదరకముందే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారు. తీరా ఎన్నికల‌లో విపక్ష కాంగ్రెస్ మంచి జోరు చూపిస్తుంది అన్న అంచనాలు ఉన్న నేపధ్యంలో సడెన్ గా తెలుగుదేశంతో పొత్తు పెట్టుంది.

అంతే అప్పటిదాకా అణగి ఉన్న తెలంగాణావాదాన్ని కేసీయార్ బయటకు లాగి మరీ రెచ్చగొట్టారు. ఆ దెబ్బతో మ్యాజిక్ ఫిగర్ ని దాటి ఏ డెబ్బయి సీట్లో దక్కించుకోవాల్సిన కాంగ్రెస్ ఒక్కసారిగా చతికిలపడిపోయింది. అలా 2018 ఎన్నికల్లో అద్వితీయంగా ద్వితీయ విజయాన్ని తన ఖాతాలో కేసీయార్ నమోదు చేసుకున్నారు. ఇక 2023లో మరోసారి గెలవాలి. హ్యాట్రిక్ కొట్టాలి. తెలంగాణాలో సీన్ చూస్తే అలా ఏమీ లేదు.

దాంతో ఏం చేయాలో తెలియక గులాబీ శిబిరం సతమతమవుతోంది. ఈ నేపధ్యంలో కమలం పార్టీ దూకుడు ఒక్కసారిగా పెంచింది. నిజానికి 2014, 2019 ఎన్నికలలో కాంగ్రెస్ టీయారెస్ ల మధ్య ద్విముఖ పోరు సాగింది. ఈసారి మాత్రం బీజేపీ జోరు చేయడంతో కచ్చితంగా త్రిముఖ పోరు జరగనుంది. ఇక చూస్తే కాంగ్రెస్ బీజేపీ రెండూ జాతీయ పార్టీలే.

ఈ రెండు పార్టీలకు దూరంగా ఉండాలని కేసీయార్ ఆలోచిస్తూ చివరికి రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. ఆయన ప్రతిపక్షాలు బలపరచిన అభ్యర్ధి, దానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది తప్ప కాంగ్రెస్ నేరుగా పెట్టిన క్యాండిడేట్ కాదు. ఈ విధంగా కేసీయార్ కాంగ్రెస్ తో తాము జట్టు కట్టాము అన్న మచ్చను లేకుడా చూసుకోగలిగారు.

అదే టైమ్ లో బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వకుండా తన వైఖరిని చాటి చెప్పగలిగారు. ఈ రెండు పార్టీలూ తమకు శతృవులే అని తెలంగాణాలో ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ముగ్గురూ ముగ్గులోకి దిగుతారు అన్న మాట. ఈసారి కేసీయార్ మీద ఉన్న వ్యతిరేకత కాస్తా బీజేపీ, కాంగ్రెస్ పంచుకుంటాయి. ఈ రెండు పార్టీలు చచ్చినా అవగాహనకు వచ్చే అవకాశం లేదు. అవి జాతీయ పార్టీలు కావడంతో పాటు వాటి మధ్య ఉన్న పోరు దశాబ్దాల నాటిది.

అందువల్ల ఢీ అంటే ఢీ కొట్టి అరవై శాతం ఉన్న టీయారెస్ వ్యతిరేకతను చెరో ముప్పై శాతం లాగేసుకున్నా పది శాతం మార్జిన్ తో అయినా టీయారెస్ బయటపడి తీరుతుంది. అదే కేసీయార్ కూడా కోరుకుంటోంది. అందుకే ఆయన మోడీ రానీయ్, అమిత్ షా రానీయ్, రాహుల్ రానీయ్ అని అంటున్నారు.

ఎంత మంది వచ్చి తెలంగాణాలో ఎంతలా తిరిగినా విపక్ష ఓట్లే భారీగా చీలిపోతాయి. తాను సేఫ్ జోన్ లో ఉంటాను, ఇదీ గులాబీ బాస్ పక్కా వ్యూహం. దాన్ని నిలబెట్టుకునెలా చివరి నిముషం వరకూ బెట్టు చేసి మరీ యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చారు. మొత్తానికి హ్యాట్రిక్ విక్టరీ కొడితే మాత్రం కేసీయార్ ని ఆపడం ఎవరి తరం కాదు, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు ఆయన ఫ్రీ అయిపోయి మోడీతో ఢిల్లీ మే సవాల్ అంటూ జబ్బలు చరచడం ఖాయం.