Begin typing your search above and press return to search.

ఉమ్మేస్తున్నారా.. కాస్త జాగ్రత్త ఇక..

By:  Tupaki Desk   |   9 April 2020 5:30 AM GMT
ఉమ్మేస్తున్నారా.. కాస్త జాగ్రత్త ఇక..
X

నోట్లో నీళ్లు పోసుకొని.. పాన్, గుట్కా, జర్దా నములుతూ తుపుక్కున ఉమ్మారో మీ పని ఇక ఖతమవుతుంది. కరోనాకు ముందు ఉమ్మితే లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా టైంలో ఉమ్మేస్తే మీపై కేసులు, జైలు పాలు కావడం ఖాయం.. సో తెలంగాణలో ఉమ్మే ముందు తస్మాత్ జాగ్రత్త..

కరోనా కల్లోలం తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో దాన్ని అదుపు చేయడానికి తెలంగాణ సర్కారు కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.

ఇప్పటికే సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీ వరకు తెలంగాణ కరోనా ఫ్రీ అవుతుందని మొదట్లో భావించారు. కానీ ఢిల్లీ తబ్లిగీ ప్రార్థనలతో తెలంగాణ లో వైరస్ విస్తృతంగా వ్యాపించింది. వారికి వారి కుటుంబాలకు, వారు కలిసిన వారికి సోకి ఇప్పుడా సంఖ్య 450 దాటుతోంది.

దీంతో తెలంగాణలో కేసీఆర్ సర్కారు కఠిన నిబంధనలు అమలు చేయడానికి సిద్ధమైంది. ఇక నుంచి తెలంగాణలో బహిరంగ ప్రదేశాల్లో పాన్, తంబాకు ఉమ్మివేయడాన్ని.. అలాగే కామన్ గా కూడా ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది.

కరోనా వైరస్ ప్రధానంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా, ఉమ్మివేయడం ద్వారా, తెమడ ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని ఐసీఎంఆర్ కూడా తాజాగా తెలిపింది. ఈ నేపథ్యం లో తెలంగాణ సర్కారు కఠిన నిబంధనలను తెలంగాణ లో అమలుకు నిర్ణయించింది.