తెలంగాణ స్ట్రాటజీ పంజాబ్ లో.. వర్కవుట్ అవుతుందా?

Wed Jul 21 2021 22:00:01 GMT+0530 (IST)

Telangana Strategy in Punjab Will there be a workout

కాంగ్రెస్ పునర్నిర్మాణానికి రాహుల్ గాంధీ సిద్ధమయ్యాడన్నది సుస్పష్టం. సీనియర్లుగా ఉన్నవాళ్లు తనకు సహకారం అందించకపోవడంతో కాడి ఎత్తేసిన రాహుల్.. అది వ్యూహాత్మకంగానే చేశాడన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని అంటున్నారు విశ్లేషకులు. అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా.. సీనియారిటీ ఐడీ కార్డు చూపించేవారు చాలా మంది. దీంతో.. విసిగిపోయిన రాహుల్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు.దీంతో.. పార్టీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో.. రాహుల్ కు సోనియా ఫ్రీహ్యాండ్ ఇచ్చేసినట్టు సమాచారం. దీంతో.. మళ్లీ రంగంలోకి వచ్చిన రాహుల్ పార్టీ కార్యకలాపాలను సీరియస్ చేపట్టారు. వెంట వెంటనే జరుగుతున్న మార్పులే ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఈ మార్పు తెలంగాణ నుంచే మొదలైంది. సీనియర్లు ఎంతో మంది ఎన్ని అడ్డంకులు పెట్టినా మరెన్ని అభ్యంతరాలు పెట్టినా.. ఫైనల్ గా పార్టీని బతికించేవాడు.. నడిపించేవాడు కావాలని రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. వెంటనే రేవంత్ కూడా తనదైన శైలిలో అల్లుకుపోయారు.

సీనియర్లను కలిసి కూల్ చేశారు. కేవలం పక్షం రోజుల్లోనే పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఇదే ఫార్ములాను పంజాబ్ లో అనుసరించారు రాహుల్. ఫైర్ బ్రాండ్ గా ఉన్న సిద్ధూకు పీసీసీ బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఇది వర్కవుట్ అవుతుందా? అన్నదే సందేహం.

ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే.. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే.. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు సిద్ధూకు పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే పరిస్థితి. వీళ్లిద్దరి మధ్య ఎప్పటి నుంచో సాగుతున్న కోల్డ్ వార్ ఆ మధ్య బద్ధలైపోయింది. సీఎం పై సిద్ధూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే.. ముఖ్యమంత్రిగా అన్నీ తన గుప్పిట్లోనే పెట్టుకున్న 80 ఏళ్ల అమరీందర్.. ఇప్పటికీ పార్టీని తన కనుసన్నల్లోనే నడిపించుకోవాలని చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే రాహుల్ సిద్ధూను లైన్లోకి తీసుకున్నారని చెబుతారు. ఆయనకు పీసీసీ ఇవ్వడంలో అంతరార్థం కూడా ఇదేనంటారు.

ఇప్పుడు రాహుల్ ను ప్రశ్నించే పరిస్థితిలో ఎవ్వరూ లేరుకాబట్టి.. మౌనం అంగీకారం అన్నట్టు సిద్ధూను సైలెంట్ గా ఆహ్వానించారు. అయితే.. నిరసన మాత్రం మరోవిధంగా తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి అమరీందర్.. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సిద్ధూకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. అంతేకాదు.. అసలు కలిసేది లేదని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలకు ఓపెన్ గా సారీ చెబితేనే దర్శనం లభిస్తుందని చెప్పారు.

మరో మంత్రి బ్రహ్మ మోహింద్రా కూడా సిద్ధూను కలవడానికి ఇష్టం చూపలేదు. ఆయనకు పీసీసీ రావడాన్ని స్వాగతిస్తున్నానని అయితే.. ముఖ్యమంత్రిని కలిసి వారి మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకున్న తర్వాతే తాను కలుస్తానని చెప్పారు. ముఖ్యమంత్రిని కాదని.. కలిస్తే తమ పదవికి ఎసరు వస్తుందేమోనన్నది ఆయన భయం.  దాదాపుగా మిగిలినవారు కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. దీంతో.. పంజాబ్ లో కాంగ్రెస్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

ఇటు చూస్తే.. వచ్చే మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీ గెలుస్తుందన్న లెక్కలు ఎవరికి వారు వేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం గ్రూపు గొడవలు సర్దుకోవడమే సరిపోయేలా ఉంది. మరి ఈ పరిస్థితిని అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది? సిద్ధూ.. పార్టీని నేతలను ఎలా సమన్వయం చేస్తారన్నది ప్రశ్న.

తెలంగాణలో రేవంత్ విపక్షంలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. పంజాబ్ లో అధికారంలో ఉన్నది కాబట్టి పంచాయితీ ముదురుతోంది. సాధ్యమైనంత త్వరగా ఈ పరిస్థితిని సెట్ చేసుకొని ఎన్నికలపై దృష్టి సారించకపోతే.. ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఏం చేస్తారన్నది చూడాలి.