కేసీఆర్ కు షాక్..ఎమ్మెల్యే పౌరసత్వం రద్దు

Wed Nov 20 2019 19:15:19 GMT+0530 (IST)

Telangana MLA Chennamaneni Ramesh no more Indian Citizen

ఓ వైపు తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె అధికార టీఆర్ ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా...తాజాగా మరో షాక్ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత - వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సభ్యత్వం రద్దయింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు నెంబర్ 260 7 2 7/30/ 2008 ఐసితో భారత ప్రభుత్వ కార్యదర్శి సుధాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ కాంగ్రెస్ నేత  శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ...ఆధారాలను పరిగణనలోకి తీసుకొని...ఈ మేరకు నిర్ణయం వెలువరించింది.2009లో చెన్నమనేని రమేశ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఆయన రాజకీయ ప్రత్యర్థి - కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ న్యాయ పోరాటం చేస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ వివిధ వేదికలను ఆశ్రయిస్తున్నారు. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆది శ్రీనివాస్ తొలుత కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. అనంతరం - ఆయన తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. దీంతో హైకోర్టు రమేశ్ పౌరసత్వంపై తగు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ  మరోసారి విచారణ జరిపింది.

తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అక్టోబర్ 31న ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే రమేష్ బాబు తరఫున లాయరు వై రామారావు - ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు రవి కిరణ్ రావు - రోహిత్ రావు హాజరై తమ వాదనలను వినిపించారు. ఈ విచారణలో..చెన్నమనేని మోసపూరితంగా భారత పౌరసత్వాన్ని పొందారని తేల్చింది. అనేక వాస్తవాలు దాచి తప్పుడు మార్గాలలో పౌరసత్వం కలిగి ఉన్నారని నిర్థారించింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరుడిగా కొనసాగడానికి అర్హత లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది.