జనసేన బాణం : కేసీయార్ కి డైరెక్ట్ గానే...?

Thu May 26 2022 08:00:01 GMT+0530 (IST)

Telangana Janasena On CM KCR

జనసేనాని ఇపుడు  రెండవ వైపు చూస్తున్నారు. ఇంతకాలం ఏపీలోనే తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చిన పవన్ ఇపుడు తెలంగాణాలోనూ కలియతిరుగుతున్నారు. అక్కడ రాజకీయాన్ని కూడా ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యనే ఉమ్మడి నల్గొండ జిల్లా టూర్ చేసి అక్కడ అశేష అభిమానాన్ని విశేషంగా చూరగొన్న పవన్ అధికార టీయారెస్ కి షాకిచ్చేలా ఒక బోల్డ్  స్టేట్మెంట్ ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో జనసేన తెలంగాణాలో పోటీ చేస్తుందని పవన్ చెప్పడంతో గులాబీ పార్టీలో గుబులు బాగానే  మొదలైంది. అది అలా ఉండగానే ఇపుడు తన అమ్ములపొది నుంచి పదునైన విమర్శనా బాణాన్ని తీసి డైరెక్ట్ గానే గురి పెట్టారు. ఏకంగా అది గులాబీ రేకులను తాకేలా బలంగానే టార్గెట్ చేశారు.

తెలంగాణాలో దళితులకు ఇస్తామన్న ముఖ్యమంత్రి కుర్చీ ఏదీ సార్లూ అంటూ టీయారెస్ పెద్దలకే ఈ బాణం తగిలేలా తెలంగాణా జనసేన ట్విట్టర్ ద్వారా బిగ్ క్వశ్చన్ రైజ్ చేశారు. కేవలం దళితుల మీద ప్రేమ చూపించినట్లుగా చెప్పుకోవడమే తప్ప ఏం చేశారు అని కూడా నిలదీశారు.

దళితులకు తెలంగాణాలోలూ తీరని అన్యాయమే జరుగుతూ వస్తోంది అని పవన్ అంటున్నారు. కేవలం దళితులను తమ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారని ఆయన తీవ్రమైన విమర్శలే చేశారు. నిజానికి ఈ విమర్శ చేయడానికి ఏ ఆంధ్రా మూలాలు ఉన్న పార్టీ ఇప్పటిదాకా సాహసించలేదు. ఆడా ఉన్నాం ఈడా ఉన్నామని చెప్పుకునే జాతీయ పార్టీ టీడీపీ కూడా ఈ ప్రశ్నను ఏనాడో ఈజీగా  మరచిపోయింది.

కానీ పవన్ మాత్రం నిర్భయంగానే నిలదీశారు. ఈ ప్రశ్నకు జవాబు రాదు ఉండదు చెప్పరు అని తెలిసినా ఎందుకు కెలికారూ అంటే అది జనాలలో నుంచి  దూసుకురావాల్సిన ప్రశ్న. రేపటి రోజున దళితులు సైతం నిలదీసి నిగ్గదీయాల్సిన ప్రశ్న. అందుకే పవన్ ఈ బాణాన్ని సంధించారు. మరి ఇది ఒక్కటి చాలు ఎనిమిదేళ్ల టీయారెస్ తాము తెలంగాణా సమాజానికి  ఎంతో చేశామని చెప్పుకుంటూ గొప్పలు పోతూ కట్టుకున్న అధికార భవంతి పునాదులలో ప్రకంపనలు రేగడానికి.  మరి దీనికి ధీటైన కౌంటర్ అటు వైపు నుంచి ఉంటుందా. వెయిట్ అండ్ సీ.