హైకోర్టు సంచలన తీర్పు.. అధికారులకు జైలు శిక్ష!

Tue Aug 20 2019 14:11:33 GMT+0530 (IST)

Telangana High Court Sentenced Jail For Two Govt Officials on Mallanna Sagar Land Expats Case

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చే తీర్పును వెలువరించింది. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కేసులో అధికారులకు షాక్ ఇచ్చింది. ఏకంగా ఇద్దరు అధికారులకు జైలు శిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు   సంచలన తీర్పును ఇచ్చింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.జులై మొదటి వారంలో మల్లన్నసాగర్ భూ నిర్వాసితులైన  తొగుట గ్రామ రైతు కూలీలు - ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతోపాటు పునరావాసం - ఉపాధి కల్పించకుండా అధికారులు పనులు చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను కోర్టుకు విన్నవించారు. అయితే రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా వ్యవహరించిన  ముగ్గురు అధికారులకు గత నెలలోనే హైకోర్టు  మూడు నెలల జైలు శిక్ష విధించింది. వెంటనే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

అయితే ఈ ఆదేశాలను ప్రస్తుత ఆర్డీవో విజేందర్ రెడ్డి - తహసీల్దార్ ప్రభులు పట్టించుకోలేదు. నిర్లక్ష్యం వహించారు. దీంతో వీరిద్దరికీ రెండు నెలల జైలు శిక్ష రెండు వేల జరిమానా విధిస్తూ తాజాగా మంగళవారం హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

జూలై 5న కూడా మల్లన్న సాగర్ నిర్వాసితుల కేసులో కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదని సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి - తొగుట తహసీల్దార్ వీర్ సింగ్ - మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజినీర్ వేణుకు 3 నెలల జైలు శిక్షను విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా మంగళవారం మరో ఇద్దరు రెవెన్యూ అధికారులకు శిక్ష విధించడం తెలంగాణ అధికారుల్లో కలకలం రేపుతోంది.