కేసీఆర్ కు షాక్!... అఫిడవిట్ పై హైకోర్టు నోటీస్!

Tue Mar 26 2019 16:46:37 GMT+0530 (IST)

Telangana High Court Issue Notices To CM KCR Over Election Affidavit Issue

ఎదుటివారిని నోరెత్తకుండా చేయడంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మించిన వారు లేరనే చెప్పాలి. అయితే ఎంతటి చాతుర్యం ఉన్నా... కోర్టుల ముందు చేతులు కట్టుకుని నిలుచోవాల్సిందే కదా. ఎంతటి ధీరుల నోరు మూయించినా... కోర్టుల ముందు మనం నోరు కట్టుకుని కూర్చోక తప్పదు కదా. ఇప్పుడు కూడా అదే జరిగింది. రాజకీయంగా తన ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బ కొట్టేసిన కేసీఆర్... న్యాయస్థానం ముందు మాత్రం చేతులు కట్టుకుని నిలుచునే పరిస్థితి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరంచిన తెలంగాణ హైకోర్టు... సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఈ  కేసు వివరాల్లోకి వెళితే... ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్... గతంలో తాను నిలిచి గెలిచిన అసెంబ్లీ సీటు గజ్వేల్ నుంచే మరోమారు బరిలోకి దిగారు. నామినేషన్ వేశారు. బరిలో ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాకిచ్చిన కేసీఆర్ బంపర్ మెజారటీతో విజయం సాధించారు. మరోమారు రాష్ట్రానికి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇంతదాకా బాగానే ఉన్నా... నామినేషన్ సందర్భంగా తనపై ఉన్న ఆస్తులు అప్పులతో పాటు కేసుల చిట్టాను కూడా ఎన్నికల సంఘానికి నివేదించాల్సిందే కదా. కేసీఆర్ కూడా ఈ పని చేశారట. అయితే తనపై ఏకంగా 64 కేసులు ఉంటే... కేసీఆర్ మాత్రం తనపై కేవలం 4 కేసులే ఉన్నాయని తెలిపారట. ఈ విషయాన్ని అప్పుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. అసలు కేసీఆర్ అఫిడవిట్ బయటకు వస్తే కదా... దాని గురించి పట్టించుకోవడానికి. అయితే ఇప్పుడలా కాదు కదా. ఎన్నికలు ముగిశాయి. కేసీఆర్ గెలిచారు. సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఈ క్రమంలో గజ్వేల్ కే చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్ కాపీని సంపాదించి... ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. తనపై 64 కేసులుంటే... కేసీఆర్ మాత్రం నాలుగు కేసులే ఉన్నట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం... కేసీఆర్ తో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఇక పిటిషన్ లో శ్రీనివాస్ ఏం కోరారంటే... పూర్తి సమాచారం ఇవ్వకుండా ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్ దాఖలు చేసిన కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని శ్రీనివాస్ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ పై ప్రాథమిక పరిశీలన చేసిన న్యాయస్థానం విచారణకు స్వీకరించడమే గాకుండా 4 వారాల్లో వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ కు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు పంపించింది. ఈ వార్త ఇప్పుడు తెలుగు నేలలో వైరల్ గా మారిపోయింది