Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశంసలు

By:  Tupaki Desk   |   13 Aug 2020 5:30 PM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశంసలు
X
ఎన్నాళ్లకెన్నాళ్లకు అనే అని చెప్పాలి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపై రాష్ట్ర హైకోర్టు కొన్నిసార్లు ఆగ్రహం.. మరికొన్నిసార్లు అసంతృప్తిని వ్యక్తం చేయటం తెలిసిందే. అన్నింటికి మించిన కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసే బులిటెన్ మీద పలుమార్లు ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. విధానాన్ని మార్చుకోవాలని స్పష్టం చేసింది. అదే పనిగా హైకోర్టు నుంచి ఎదురవుతున్న ఎదురుదెబ్బల నేపథ్యంలో కొద్ది కాలంగా ఒకట్రెండు పేజీలతో అరకొర సమాచారంతో ఇచ్చే వివరాల్ని తప్పు పట్టేది.

హైకోర్టు స్పందన చూసిన తర్వాత.. ప్రభుత్వం తన తీరును మార్చుకొని.. కొత్త తరహాలో బులిటెన్ ను విడుదల చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న కరోనా పరీక్షలు.. చికిత్సలపై విచారణ సాగింది. ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో సహా పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టుకు నివేదికను అందజేశారు. ఈ నెల మూడు నుంచి సుమారు 42 వేల మంది సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు.

హోటళ్లలో ఐసోలేషన్ పడకలు 857 నుంచి 2995కు పెరిగినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. యాభై ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులు అందగా.. 46 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. తామిచ్చిన నోటీసులకు 16 ఆసుపత్రులు వివరణ ఇచ్చాయన్నారు. జీహెచ్ఎంసీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతోందన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది రాత్రీ పగలు కష్టపడుతున్నారని.. బులెటిన్ ను తెలుగులో కూడా ఇచ్చినట్లుగా సోమేశ్ వెల్లడించారు.

దీనికి స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వం సరైన దారిలో వెళుతుందన్నారు. అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలన్న ఉద్దేశం తమకు లేదని.. ప్రభుత్వాన్ని.. అధికార యంత్రాంగాన్ని తిట్టాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. చిన్న చిన్న లోపాల్ని సరిదిద్దాలనేదే.. తమ ప్రయత్నమన్నారు. దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది తమ ప్రయత్నమన్నారు.ప్రభుత్వ నిర్ణయాల్ని ఉల్లంఘించే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పస్టం చేసింది. కరోనా బులిటెన్ లో ప్రైమరీ.. సెకండరీ కాంటాక్టు వివరాలు కూడా తెలియజేయాలన్నారు.