బ్రేకింగ్: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్

Fri Jul 10 2020 13:54:58 GMT+0530 (IST)

Telangana High Court Gives Stay on Secretariat Demolition

తెలంగాణ ప్రభుత్వం ఎంతో చాకచక్యంగా రహస్యంగా తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేస్తున్నా ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అనుమతిచ్చిన హైకోర్టే తాజాగా మరోసారి బ్రేక్ వేసింది.తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసింది. సోమవారం వరకు పనులు నిలిపివేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నగరానికి చెందిన సామాజికవేత్త పీఎల్ విశ్వేశ్వరరావు వేసిన పిల్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా ఈ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది.

కాగా ఇప్పటికే తెలంగాణ సచివాలయాన్ని దాదాపు 60శాతం కూల్చివేసినట్టు తెలిసింది. తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదని.. అప్పటివరకు యథాతథంగా పనులు జరుగుతాయని సచివాలయ అధికారులు చెబుతున్నారు. ఆదేశాలు అందాక తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

కాగా వారం రోజుల క్రితమే కూల్చివేతకు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మంగళవారం పనులు ప్రారంభించి కూల్చివేస్తున్నారు. నాలుగురోజుల్లోనే మళ్లీ పనులకు బ్రేక్ పడడం గమనార్హం.