Begin typing your search above and press return to search.

కరోనా బులెటిన్ పై టీ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   18 Jun 2020 2:00 PM GMT
కరోనా బులెటిన్ పై టీ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు
X
దేశవ్యాప్తంగా కరోనాపై అప్రమత్తంగా ఉంటే తెలంగాణలో మాత్రం ఇప్పటికీ పరీక్షలు చేయకుండా తప్పుడు లెక్కలతో కేసీఆర్ సర్కార్ మోసం చేస్తోందని ప్రతిపక్షాలు, హైకోర్టు ఇప్పటికే ఆక్షేపించాయి. అయినా కేసీఆర్ సర్కార్ తెలంగాణలో పెద్దగా కరోనా పరీక్షలు చేయడం లేదు. పక్కనున్న ఏపీలో వేలకు వేల టెస్టులు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం లక్షణాలు బయటపడ్డ వారికి మాత్రమే చేస్తోంది.ఈ పరిణామం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. టెస్టులు చేయకపోవడంతో వారు మరింత మందికి అంటిస్తూ వైరస్ వ్యాప్తి చెందుతోందన్న భయాలు జనాల్లో నెలకొన్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా దాఖలైన పిటీషన్ ను ఇవాళ విచారించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ కు సంబంధించిన కీలక సమాచారం మీడియా బులిటెన్ లో ఉండాలని స్పష్టం చేసింది.

బులెటిన్ లో ఖచ్చితంగా వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నందున వార్డుల వారీగా కేసుల వివరాలు ప్రకటించాలని.. తద్వారా ప్రజలు అప్రమత్తమవుతారని ఆదేశాలు జారీ చేసింది.

ఈ విచారణకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ , గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ హాజరయ్యారు. డాక్టర్లకు, పోలీసులకు పీపీఈ కిట్లు, మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వాలని ఆదేశించింది. వార్డుల వారీగా కేసులు వెల్లడించి ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నిర్వహించాలంటూ హైకోర్టు సూచించింది. ఈనెల 29లోగా దీనిపై నివేదిక సమర్పించాలని సూచించింది.