Begin typing your search above and press return to search.

సాగర్ నిమజ్జనంపై టీ హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యల్ని విన్నారా?

By:  Tupaki Desk   |   14 Sep 2021 3:08 AM GMT
సాగర్ నిమజ్జనంపై టీ హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యల్ని విన్నారా?
X
ప్రత్యర్థులకు తన రాజకీయ ఎత్తులతో ఉక్కిరిబిక్కిరి చేసి.. పగలే చుక్కలు చూపించే సీఎం కేసీఆర్ కు.. ఆయన ప్రభుత్వానికి తాజాగా ముందుకెళితే నుయ్యి.. వెనక్కి వెళితే గొయ్యి అన్న పరిస్థితి చోటు చేసుకుంది. తాజాగా గణేశ్ నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్ లో చేయటంపై రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం చెప్పటమే కాదు.. ఈసారి నిమజ్జనాన్ని సాగర్ లో చేయటానికి ససేమిరా అనటం తెలిసిందే. అలా అని.. సాగర్ లో నిమజ్జనం చేయకుంటే ఏం జరుగుతుందో కేసీఆర్ సర్కారుకు తెలియంది కాదు. అందుకే.. హైకోర్టు ఆదేశాలపై రివ్యూ పిటిషన్ ను దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఊపిరి పీల్చుకోలేని రీతిలో వ్యాఖ్యలు చేసింది.

సాగర్ లో నిమజ్జనం చేయకూడదన్న ఉత్తర్వుల్ని సవరించాలంటూ జీహెచ్ఎంసీ వేసిన పిటిషన్ ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు.. జస్టిస్ వినోద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టేయటం తెలిసిందే. అవసరమైతే.. తమ తీర్పును సవాలు చేయాలని కోరింది. తాము ఇప్పటికే ట్యాంక్ బండ్ మీద భారీ క్రేన్ లను ఏర్పాటు చేశామని.. బేబీ పాండ్స్ లో భారీ విగ్రహాల్ని నిమజ్జనం చేయటం సాధ్యం కాదని పేర్కొంది. దీనికి హైకోర్టు ససేమిరా అనటమే కాదు.. తాము జారీ చేసిన ఆదేశాల్ని సవరించటం సాధ్యం కాదని తేల్చేసింది.

ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కీలకంగానే కాదు.. కేసీఆర్ సర్కారు పాలనా లోపాల్ని ఎత్తి చూపేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ వినిపించిన వాదన ఏమిటి? దానికి బదులుగా కోర్టు చేసిన కీలక వ్యాఖ్యల్ని చూస్తే..

జీహెచ్ఎంసీ వాదన ఏమంటే?

- ఇప్ప టికే ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్‌ లను ఏర్పాటు చేశాం. బేబీ పాండ్స్‌లో భారీ విగ్రహాలను నిమజ్జనం చేయడం సాధ్యం కాదు.

- ఈ ఏడాదికి ట్యాంక్‌బండ్‌ వైపు నిమజ్జనానికి, అలాగే పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేసేందుకు అనుమతించాలి. నిమజ్జనం పూర్తయిన 24 గంటల్లో వ్యర్థపదార్థాలను తొలగిస్తాం.

- ట్యాంక్‌బండ్‌పై అనుమతించకపోతే వేలాది విగ్రహాల నిమజ్జనానికి 6 రోజుల సమయం పడుతుంది.

- అదే సమయంలో నెక్లెస్‌రోడ్, ఇతర మార్గాల్లో ఇప్పటికిప్పుడు రబ్బర్‌ డ్యాం ఏర్పాటు చేయడం సాధ్యం కాదు.

హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇవే

- తనకు భారీ విగ్రహాలు పెట్టాలని, అవి ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసినవే ఉండాలని వినాయకుడు కోరుకోడు. దేవుడి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలని పురాణాల్లో ఎక్కడా పేర్కొనలేదు.

- జీహెచ్ఎంసీ చట్టంలోనే జల కాలుష్యం జరగకుండా చూడాలని ఉంది. ఈ చట్టం వచ్చి 66 ఏళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ విగ్రహాల నిమజ్జనం పేరుతో కాలుష్యాన్ని ప్రోత్సహిస్తున్నారు.

- 2020 జూన్‌లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పీవోపీ విగ్రహాలను నిషేధించాలని.. జల, శబ్ధ కాలుష్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీచేసింది. దాదాపు ఏడాది ముందే మార్గదర్శకాలు జారీ చేసినా అమలు చేయకుండా ఇప్పుడు మినహాయింపులు కోరడం సరికాదు.

- జలాశయాలను కలుషితం చేస్తామంటే అనుమతించాలా? మేం చట్టాలను, హైకోర్టు తీర్పులను మాత్రమే అమలు చేయాలంటున్నాం. చట్టాలను ఉల్లంఘిస్తారా? అమలు చేస్తారా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం.

- గతంలో జీహెచ్ఎంసీ దాఖలు చేసిన మూడు కౌంటర్లలో ఎక్కడా బేబీ పాండ్స్‌లో నిమజ్జనానికి ఇబ్బందులు ఉన్నాయని పేర్కొనలేదే?

- మేం ఆదేశాలు జారీచేసిన తర్వాత ఇప్పుడు పొంతన లేని కారణాలు చెబుతున్నారు.

- ట్యాంక్‌బండ్‌ వైపు ఇటీవల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు నిమజ్జనానికి అనుమతిస్తే కొత్తగా వేసిన రెయిలింగ్, గార్డెన్స్, ఇతర లైటింగ్‌ దెబ్బతినే అవకాశం ఉంది. నిమజ్జనం ఉంటుందని తెలిసినా ఎందుకు అక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు?

- ఇప్పుడు నిమజ్జనానికి అనుమతిస్తే అవన్నీ దెబ్బతిని తిరిగి నిర్మించాలి. మనం చెల్లించే పన్నుల ద్వారా ప్రభుత్వం ఈ పనులు చేపట్టింది. ఈ డబ్బు వృథాకు ఎవరు బాధ్యులు.