Begin typing your search above and press return to search.

కేసీఆర్ కల - కొత్తసచివాలయం దిశగా తొలి అడుగు పూర్తి!

By:  Tupaki Desk   |   11 Aug 2020 7:15 AM GMT
కేసీఆర్ కల - కొత్తసచివాలయం దిశగా తొలి అడుగు పూర్తి!
X
కేసీఆర్ కోరిక నెరవేరింది. కొత్త సచివాలయం నిర్మాణంలో మొదటి అడ్డంకి పూర్తిగా తొలగిపోయింది. పాత సచివాలయం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. రెండు సంవత్సరాలుగా కొత్త సచివాలయం కల కంటున్న కేసీఆర్ కు ఆ క్రమంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. తాను కోరుకున్న స్థలంలో నిర్మించే అవకాశం దక్కలేదు.

పోనీ పాతసచివాలయం తొలగించి అక్కడే కొత్త నిర్మిద్దాం అంటే దానికి కూడా అనేక ఆటంకాలు వచ్చాయి. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయి. దీంతో సుదీర్ఘ వాదనలు, వాదోపవాదాల తర్వాత కోర్టు అనుమతి దక్కింది. మళ్లీ ఒకట్రెండు సార్లు కూల్చివేత మొదలయ్యాక కూడా బ్రేకులు పడ్డాయి. చివరకు కోర్టు నుంచి పూర్తిగా అనుమతి దక్కింది.

ఎన్ని విమ‌ర్శ‌లు వచ్చినా... ఎలాగైనా కొత్త సచివాలయం కట్టాల్సిందే అని ఫిక్సయిన కేసీఆర్ పట్టుబట్టి సాధించారు. మొత్తం పాతసచివాలయం నేలమట్టమైపోయింది. బహుశా చరిత్రలో ఇంతవేగంగా కూల్చివేతలు ఎక్కడా జరిగి ఉండవు. మళ్లీ ప్రతిపక్షాలు ఎక్కడ సుప్రీంకోర్టుకు వెళతాయో అని శరవేగంగా ప్రభుత్వం సచివాలయ కూల్చివేత పనులను పూర్తిచేసింది.

సచివాలయంలో ఉన్న మొత్తం 11 బ్లాక్‌ల కూల్చివేతల్లో ... సోమ‌వారం చివ‌ర‌గా ఎల్ బ్లాక్ ను కూల్చివేశారు. శిథిలాల తొలగింపు కొంతవరకు పూర్తయింది. మిగతావి కూడా తొలగిస్తున్నారు. శిథిలాల్లో పెద్ద ఎత్తున పునర్వినియోగ వనరులు ఇనుము, అల్యూమినియం వంటి సామాగ్రిని పక్కన పెడుతున్నారు. వ్యర్ధాల తొలగింపు చిన్న పనేం కాదు. నిరంతరాయంగా చేపట్టినా... మరో నెల రోజుల సమయం ప‌డుతుంది.

కేవలం ఏడాదిలో కొత్త సచివాలయం కట్టి తీరాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త డిజైన్ల‌కు కేబినెట్ ఆమోదం లభించింది. వ్యర్థాలు తొలగించిన అనంతరం మంచి ముహుర్తంలో కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరగనుంది.