కూల్చివేత షురూ.. కేసీఆర్ స్పీడప్

Tue Jul 07 2020 10:15:22 GMT+0530 (IST)

Telangana HC clears construction of KCR govt new secretariat

ఎన్నో అడ్డంకులు.. ఆటుపోట్ల తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్ ఊరట చెందారు. కొత్త సచివాలయ నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. పాత సచివాలయం వాస్తు ప్రకారం లేదని అక్కడికి వెళ్లకుండా ప్రగతి భవన్ కట్టుకొని తెలంగాణకు పవర్ సెంటర్ గా మార్చి అక్కడి నుంచే పాలిస్తున్న కేసీఆర్.. ఇప్పుడు పాత సచివాలయం కూల్చివేతను షురూ చేశారు.తెలంగాణ సచివాలయం కూల్చి అత్యద్భుతంగా కొత్తది కట్టాలనుకున్న కేసీఆర్ కలలకు ప్రతిపక్షాలతోపాటు కొందరు హైకోర్టుకెక్కి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే శంకుస్థాపన చేసి మరీ వదిలేశారు. హైకోర్టులో అడ్డంకులన్నీ తొలిగి పాతది కూల్చి కొత్తది కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దని డిసైడ్ అయ్యారు. ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లేముందే పాత సచివాలయం కూల్చి కొత్త సచివాలయానికి పనులు మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడు. తాజాగా పాత సచివాలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా చేయాలన్న డిమాండ్ మొదలైన నేపథ్యంలో కేసీఆర్ కూల్చివేత పనులు స్పీడప్ చేస్తున్నారు.

తాజాగా కోర్టు తీర్పు ఇచ్చిన మూడు రోజుల్లోనే కేసీఆర్ సర్కార్ అలెర్ట్ అయ్యింది. మంగళవారం ఉదయం పాత సచివాలయానికి వెళ్లే అన్ని రహదారులను మూసివేసిన అధికారులు లోపల కూల్చివేత పనులు ప్రారంభించారు. గతంలోనే ఈ కూల్చివేత కాంట్రాక్టును ఇతరులకు అప్పగించారు. కోర్టు కేసుల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే పాత సచివాలయంలో వాహనాలు ఇతర సామాన్లు సర్వర్లను రెండు మూడు రోజులుగా తరలించారు. ఇప్పుడు కూల్చివేతలు ప్రారంభించారు.

పాత సచివాలయంలోనే ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ భవనాలున్నాయి. వాటిని జగన్ ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్ కోరిక మేరకు తెలంగాణకు బదలాయించేసింది. దాంతో వాటిని కూలగొట్టి అత్యద్భుతంగా కొత్త భవనాన్ని నిర్మించనున్నారు.  ఇప్పటికే కేసీఆర్ కొత్త భవనాన్ని ఖరారు చేసి శంకుస్థాపన కూడా చేశారు. దీంతో ఇక శరవేగంగా కొత్త సచివాలయం నిర్మించాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు.