నాటి సినిమా టైటిల్ ను గుర్తు చేస్తున్న టీ కాంగ్రెస్ పరిస్థితి!

Fri Mar 15 2019 09:57:05 GMT+0530 (IST)

Telangana Congress Party Leaders Ready To Join TRS Party

ఎన్నికలు జరిగి ఆర్నెల్లు కూడా కాలేదు. కానీ.. అప్పుడే ఆరుగురు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకెంత మారుతుందో తెలీని పరిస్థితి. ఇలాంటివేళ.. ఒక పోలిక కాంగ్రెస్ నేతల మాటల్లో వినిపిస్తోంది. 1960లలో అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీసిన సినిమా టైటిల్ కు తగ్గట్లే తాజాగా పార్టీ పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తోంది. ఆ సినిమా బాగుందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించగా.. ఆర్థికంగా మాత్రం ఎలాంటి ప్రయోజనం కలుగలేదట.ఈ సినిమాలో నటించిన నటీనటులకు అవార్డులు.. ప్రేక్షకుల గుర్తింపు లభించినా.. సినిమా తీసిన నిర్మాతలకు మాత్రం కాసులు రాల్చలేదట. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అప్పటి సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉందన్న ఆసక్తికర పోలిక ఒకటి వినిపిస్తోంది.

1960లలో అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి.. ఎం. సత్యనారాయణరావు మరికొందరు స్నేహితులు కలిసి ఒక సినిమా తీశారు. దాని పేరు.. చివరకు మిగిలేది! ఆ సినిమాలో మహానటి సావిత్రి.. బాలయ్య.. కాంతారావు హేమాహేమీల్లాంటి నటులు నటించారు. ఈ సినిమాను పీవీ నరసింహారావుతో సహా విమర్శకులు సైతం ప్రశంసించారు. విమర్శకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా వాణిజ్యంగా విజయం సాధించలేదు.

ఈ సినిమాలో సావిత్రి నటకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. కానీ.. నిర్మాతలకు మాత్రం పైసలు తెచ్చి పెట్టలేదు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అప్పటి సినిమా టైటిల్ ను గుర్తుకు తెస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికి ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి జంప్ కాగా.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఎంతగా ఉంటుందన్నది ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. నిన్నటి వరకూ ఐదుగురుగా ఉన్న సంఖ్య నిన్న సాయంత్రం టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మాజీ మంత్రి తుమ్మలను ఓడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గులాబీ గూటికి చేరేందుకు సిద్ధం కావటంతో ఆరో వికెట్ పడినట్లైంది.

ఈ చేరికలన్ని ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి చోటు చేసుకోవటం షురూ అయ్యింది. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆపరేషన్ ఆకర్ష్ అంతకంతకూ పెరుగుతూ.. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు పార్టీ నుంచి తరలిపోతున్న పరిస్థితి. ఇదే రీతిలో జోరు కొనసాగితే కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అధినాయకత్వం కూడా ఈ చేరికలకు అడ్డుకట్ట వేసేలా ప్రయత్నించటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాంధీ భవన్ నుంచి ప్రగతిభవన్ బాట పడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో మరికొంతమంది గులాబీ కారు ఎక్కటం పక్కా అన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. కాంగ్రెస్ ఖాళీ కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.