ప్రధానికి కేసీఆర్ లేఖ: విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణకు డిమాండ్

Tue Jun 02 2020 23:00:01 GMT+0530 (IST)

KCR letter to Prime Minister: Demanding the withdrawal of the Electricity Amendment Bill

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ సవరణ బిల్లుపై గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యతిరేకించారు. ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఈ విషయంపై లేఖ రాస్తానని ప్రకటించిన కేసీఆర్ తాజాగా లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోమవారం సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.విద్యుత్ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందకుండా అడ్డకుంటామని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ క్రమంలో బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలు తెలిపేందుకు జూన్ 5వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ స్పందించి ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఒక్కటే మాట చెబుతున్నారు.. ఈ బిల్లు సరికానిది.. రాష్ట్రాలకు విఘాతం కలిగించే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు.