Begin typing your search above and press return to search.

రాష్ట్రాన్ని చీల్చిన కేసీయార్ లో జాతీయ వాదం ఎంత...?

By:  Tupaki Desk   |   2 Oct 2022 11:30 PM GMT
రాష్ట్రాన్ని చీల్చిన కేసీయార్ లో జాతీయ వాదం  ఎంత...?
X
జాతీయ రాజకీయాల్లో రాణించాలన్న తహతహ కేసీయార్ కి ఉండవచ్చు. అందులో ఏ మాత్రం తప్పు లేదు. ఆ మాటకు వస్తే ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది కూడా జాతీయ రాజకీయాలు చేయడానికి అర్హులే. ఒక రాష్ట్రానికి సీఎం గా ఉంటూ రాజకీయంగా విజయవంతం అయిన కేసీయార్ జాతీయ పార్టీతో వస్తాను అంటే అది ఆయన ఇష్టమనే ఎవరైనా అంటారు కానీ వద్దు అని ఎందుకు చెబుతారు.

కానీ ఇపుడు దేశంలో ఉన్న రాజకీయం కేసీయార్ కొత్త పార్టీకి ఎంతవరకూ సహకరిస్తుంది అన్నది కనుక చూస్తే చేదు జవాబే వస్తొంది. దేశ రాజకీయం బీజేపీ యాంటీ బీజేపీగా చీలిపోయి ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ అన్న విధంగా ఎలా విభజన జరిగిందో ఇపుడు కూడా అటు నుంచి ఇటు జరిగింది అంతే.

బీజేపీని అభిమానించే వారు 37 శాతం ఉన్నారని గడచిన ఎన్నికలు రుజువు చేశాయి. ఆ శాతం ఒకటి రెండు తగ్గినా అవతల ఎవరి వైపునకు వెళ్తుంది అన్నది బీజేపీకి రాష్ట్రాల స్థాయిలో ప్రత్యర్ధిగా ఎవరుంటే వారికే అని చెప్పాలి. అంతే తప్ప గుత్తమొత్తంగా ఒకే పార్టీకి పోయే సీన్ అయితే లేదు. బీజేపీయేతర పార్టీలు తీసుకుంటే కాంగ్రెస్ అగ్ర భాగాన ఉంది. అయితే ఆ పార్టీ దేశమంతా బీజేపీకి పోటీ ఇచ్చే స్థితిలో లేదు.

దాంతో ప్రాంతీయ పార్టీలతో చాలా చోట్ల బీజేపీ పోరాడాల్సి వస్తోంది. ఇక బీజేపీని కాదని అన్నప్పుడు జనాలు ఎవరిని ఎంచుకోవాలి అంటే రాష్ట్రాల స్థాయిలో ప్రాంతీయ పార్టీలే ఆల్టర్నేషన్ గా ముందుకు వస్తున్నాయి. తమిళనాడులో తీసుకుంటే ప్రాంతీయ వాదమే తప్ప జాతీయ వాదం నెగ్గదు. ఇది అక్కడ అర్ధ శతాబ్దం రాజకీయ చరిత్ర.

ఏపీలో చూసుకుంటే రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జనసేన కూడా మూడవ పార్టీగా ముందుకు వస్తోంది. ఇక్కడ కేసీయార్ జాతీయ పార్టీకి ఎంత దాకా స్కోప్ ఉంటుందో తెలియదు. పైగా విభజన ఏపీలో కేసీయార్ అంటే ఇష్టపడి ఓటేసే వారు పెద్దగా ఉంటారా అన్నది మరో చర్చ.

కర్నాటకలో కాంగ్రెస్, బీజేపీ గట్టిగా ఉన్నాయి. మూడవ పార్టీగా జేడీఎస్ ఉంది. ఆ పార్టీ పరిమితమైన చోట్ల తమ పాత్ర పోషిస్తోంది. అక్కడ కొత్త జాతీయ పార్టీ అంటే జనాలు ఎంతవరకూ ఉత్సాహపడతారు అన్నది తెలియదు. కేరళలో మూడవ జాతీయ పార్టీగా బీజేపీ ఎమర్జ్ కాలేకపోతోంది. కాంగ్రెస్ వామపక్షాలే అక్కడ పోటీలో ఉన్నాయి.

ఉత్తరాదిన చూస్తే అక్కడ అంతా ప్రాంతీయ భావజాలం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇక జాతీయ పార్టీ హోదాలో ఉన్న మమతా బెంజరీ తృణమూల్ కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. నితీష్ కుమార్ జాతీయ ముద్ర కోసం దశాబ్దాల పాటుగా పరితపిస్తున్నా ఎక్కడా వర్కౌట్ కావడంలేదు. ఆప్ అధినేత కేజ్రీవాల్ రెండు రాష్ట్రాలో నెగ్గి మరి చోట్ల పోటీ చేస్తూ ఉనినికి చాటుకున్నా ఇంకా నేషనల్ లెవెల్ లో ఫోకస్ పెద్దగా లేదు.

అలాగే జాతీయ స్థాయిలో మరాఠా యోధుడు వృద్ధ నేత శరద్ పవార్ లాంటి వారు ఎంతో మంది ఉన్న చోట సౌత్ నుంచి అందునా ఒక చిన్న రాష్ట్రం నుంచి వెళ్ళిన కేసీయార్ జాతీయ రాజకీయం అంటే అది చాలా కష్టంగానే చూడాలి అంటున్నారు. పైగా జాతీయ రాజకీయాల్లో ఎక్కడా బీజేపీని ఎదిరిస్తూ ఎఖాండీగా మరో పార్టీ రాజకీయం చేయడానికి పొలిటికల్ స్పేస్ అయితే ఈ రోజుకు లేదు అని చెప్పాలి.

ఇక కేసీయార్ లో జాతీయ వాదం ఎంతవరకూ ఉంది అన్నది కూడా మరో చర్చగా ముందుకు వస్తోంది. ఆయన ఉమ్మడి ఏపీని రెండుగా చీల్చారు. ప్రాంతీయ రాజకీయాల్లో ఉప ప్రాంతీయ ఉద్యమాలు చేశారు. ఆ విషయంలో అనేకానేక కారణాల వల్ల ఆయన సక్సెస్ అయ్యారు. కేసీయార్ లో జాతీయ భావజాలం ఎంత అన్న దాని మీద సాటి ఆంధ్ర రాష్ట్రమే ఆలోచిస్తుంది అని కూడా అంటారు.

ఏపీకి తెలంగాణాకు మధ్య ఆస్తుల వివాదాలు వచ్చినా లేక ఏ రకమైన గొడవలు వచ్చినా కేసీయార్ ఫక్తు తెలంగాణా మనిషిగా అటు వైపే ఉంటారు. మరి అన్నీ తెలిసి ఆయన జాతీయ పార్టీ పెడితే తమ హక్కులు మరింతగా ఇబ్బందుల‌లో పడతాయని ఏపీ వారు అనుమానించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది కూడా ఈ సందర్భంగా ఆలోచించే సీరియస్ విషయమే.

ఇక కేసీయార్ కి హిందీ బాగా వచ్చు. అందువల్ల ఆయన జాతీయ రాజకీయాల్లో రాణించాలనుకుంటే అది భాషాపరమైన ఇబ్బందిని అధిగమించగలదు తప్ప ఓట్లు రాల్చే పరిస్థితి ఉండదనే అంటారు. తెలంగాణాలో ఉన్నవి 17 సీట్లు మాత్రమే. ముందే చెప్పుకున్నట్లుగా మిగిలిన రాష్ట్రాలో ఎన్ని చోట్ల పోటీ చేసినా కూడా కేసీయార్ పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు వస్తాయా అంటే ఈ రోజుకు ఈ పూటకు మాత్రం డౌటే అంటున్నారు.

మరి పార్టీ పెట్టి జాతీయ స్థాయిలో ఆయన బాగా తిరిగి బీజేపీ వ్యతిరేక శక్తులను తనకు అనుకూలంగా మార్చుకుంటే ఏమైనా ఉనికి పోరాటం చేయవచ్చేమో అన్నదే అసలైన రాజకీయ విశ్లేషణ. ఇక్కడ టీయారెస్ వంటి ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అవడం ఈజీయే కానీ ఆ స్థాయిలో దేశంలోని 28 రాష్ట్రాలలో ఆ పార్టీ జాతీయ పార్టీగా తన ముద్ర వేసుకుంటుందా అంటే ఇపుడున్న జాతీయ సన్నివేశంలో కుదరదు అన్నదే నిష్టుర సత్యం.

పైగా 2024 ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. పార్టీ పెట్టి జనాల్లోకి తీసుకువెళ్ళడం ఇంత తక్కువ టైం లో సాధ్యమయ్యేది కూడా కాదనే అంటున్నారు. కాకపోతే ముందే చెప్పుకున్నట్లుగా కేసీయార్ ది ఉబలాటం, ఆరాటం. ఆ ఉత్సాహాన్ని కాదనే వారు ఎవరు అన్నదే ప్రశ్న.

ఇక చివరిగా ఒక్క మాట. ఈ దేశంలో కొత్తగా జాతీయ పార్టీ కోసం 140 కోట్ల మంది జనాలు ఎదురుచూడడంలేదు. తమకు ఇంతకంటే మెరుగైన జీవితం కోసం వారు చూస్తున్నారు. అది కూడా ఇపుడున్న పార్టీలు చేస్తే హ్యాపీ అని అంటున్నారు. బీజేపీ మీద పీకల దాకా కోపం అయితే ఈ రోజుకీ దేశ ప్రజలకు లేదు. అలాగే కాంగ్రెస్ ఎంత తగ్గినా ఆ పార్టీని పూర్తిగా పక్కకు పెట్టేయాలని అనుకోవడంలేదు. ఇక ప్రాంతీయ పార్తీల సెంటిమెంట్లు వాటి అవసరాలు ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా కేసీయార్ కి తెలియకుండా ఉంటాయా. వాటిని దాటి తన పార్టీకే ఓటేయాలని ఆయన కోరుకోవడం అంటే అది రాజకీయ అత్యాశగానే చూస్తారేమో.