Begin typing your search above and press return to search.

6 అంతస్తులు.. 500 కోట్లు.. కేసీఆర్ సెక్రెటేరియట్ ఖర్చు?

By:  Tupaki Desk   |   8 July 2020 8:30 AM GMT
6 అంతస్తులు.. 500 కోట్లు.. కేసీఆర్ సెక్రెటేరియట్ ఖర్చు?
X
కొత్త సచివాలయం నిర్మాణానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కేసీఆర్ రెడీ అయిపోయారు. జెట్ స్పీడుతో పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులు రాత్రికిరాత్రి ప్రారంభించారు.. పోలీసులను అడ్డంగా నిలబెట్టి.. రహదారులు మూసేసి సెక్రటేరియట్ రహదారిలోకి ఈగలను కూడా అనుమతించడం లేదు. ఇప్పటికే ప్రతిపక్షాలు, కొందరు సచివాలయ కూల్చివేతపై కోర్టులకెక్కి జాప్యం చేయడంతో ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయవద్దని కేసీఆర్ ఇలా స్పీడప్ చేస్తున్నారు.

ఇది ఓవైపు జరుగుతుండగానే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం డిజైన్ కోసం తన అధికారిక అనుమతి ఇచ్చారు. ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ హఫీజ్ రూపొందించిన డిజైన్ ను సీఎం కేసీఆర్ ఆమోదించారు. కొత్త డిజైన్ పాక్షికంగా వనపార్తిలోని కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాలను పోలి ఉంటుంది. కేసీఆర్ ఈ కొత్త సచివాలయాన్ని ‘వాస్తు’ లొసుగులు లేకుండా పకడ్బందీగా రూపొందిస్తున్నారు.

కొత్త సచివాలయం ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల భవనంగా నిర్మిస్తారు. నిర్మాణానికి అంచనా బడ్జెట్ సుమారు 400-500 కోట్లు. కొత్త సచివాలయంలో మంత్రుల కార్యాలయాలు మరియు సంబంధిత కార్యదర్శుల కార్యాలయాలు ఉంటాయి.

ఇవేకాకుండా సీఎం ప్రవేశించే ద్వారాలు భద్రతాపరమైన కారణాల వల్ల ఆధునిక సాంకేతిక అంశాలను జోడిస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఎదురుగా ఉన్న ఈ మొత్తం వైశాల్యం 27 ఎకరాలలో విస్తరించి ఉంది. అయితే 20 శాతం స్థలం మాత్రమే సచివాలయం నిర్మాణానికి ఉపయోగించబడుతోంది. మిగిలిన భూమిలో ప్రకృతి దృశ్యాలు, ఫౌంటైన్లు మరియు పార్కింగ్ కోసం ఉపయోగిస్తారు. ఇది ఒకేసారి కనీసం 800 వాహనాలను నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త సచివాలయం నిర్మాణ పనులు జూలై చివరి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రికార్డు సమయంలో ఇది పూర్తి చేసే అవకాశాలున్నాయి.

మొత్తం మీద కేసీఆర్ కల నెరవేరబోతోంది. కేసీఆర్ తన రెండో పదవీకాలం ముగిసేలోపు కొత్త సచివాలయంలోకి అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. అది నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.