మరో ఎటకారం: యూటర్న్ మహానుభావుడు బాబు..

Mon May 20 2019 19:01:14 GMT+0530 (IST)

Telangana BJP President Laxman Comments on Chandrababu Naidu

ఎగ్జిట్ ఫలితాలు ఇస్తున్న జోష్ తో చెలరేగిపోతున్నారు బీజేపీ నేతలు. మొన్నటివరకూ ఫలితాలు ఎలా ఉంటాయన్న సందేహంలో ఉన్న వారు మాటల కంటే మౌనాన్నే ఎక్కువగా ఆశ్రయించారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన బలంతో ఇప్పుడు వారు రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఓపక్క బీజేపీ అధినాయకత్వం ఆపరేషన్ మధ్యప్రదేశ్ ను షురూ చేయగా.. మరోవైపు ఎవరికి వారు తమ రాజకీయ ప్రత్యర్థులపై దృష్టి పెడుతున్నారు.తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ విజయం మీద ధీమాను వ్యక్తం చేసిన ఆయన.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరి అవసరం లేదన్నట్లుగా ఆయన పోలిక ఒకటి పోలుస్తూ.. సింహం సింగిల్ గా వస్తుందని.. అంతా స్వీప్ చేస్తుందన్నారు. బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 సీట్లకు తగ్గకుండా గెలుస్తుందని పేర్కొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రుల ఫ్రంట్ కు టెంట్ కూడా దిక్కు లేకుండా పోయిందని ఎటకారం ఆడేసిన ఆయన.. రెండు కూటములు ఏకమైనా బీజేపీ దరిదాపుల్లోకి లేకుండా పోయారన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఫ్యామిలీ ఫ్రంట్ గా.. ఫెయ్యిలూర్ ఫ్రంట్ గా మారిందన్న ఆయన.. ఎన్నికల ఫలితాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు చంద్రగ్రహణం వీడుతుందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది విచిత్రమైన మెంటాలిటీ అంటూ వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. ఓటమికి బాబు సాకులు వెతుకుతున్నారని.. ట్యాంపరింగ్ జరిగిందని అంటున్న ఆయన.. మరోవైపు తాను గెలుస్తానని చెప్పటంలో అర్థం లేదన్నారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారంటూ తప్పు పట్టారు. 2014 ఎన్నికల్లో బాబు గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేస్తాయంటారని.. కానీ ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని అంటున్నారన్నారు. అందుకే చంద్రబాబును యూటర్న్ మహానుభావుడని అంటారన్నారు.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశం ఒక్కతాటి మీద నిలవాల్సిన వేళ.. కొన్ని పార్టీలు పాకిస్తాన్ అనుకూల భాషను వాడటంలో ప్రజలు తిరగబడ్డారన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు పని తీరు బాగుందని.. దేశ అంతర్గత భద్రతలో ఎక్కడా రాజీపడని తీరుతోనే ఎన్డీయేకు ప్రజలు మరోసారి పట్టం కట్టనున్నట్లు చెప్పారు.