టీ బీజేపీలో జంపింగ్ లకే పెద్ద పీట..పాత వాళ్లు చులకనేనా..!

Wed Nov 20 2019 20:00:01 GMT+0530 (IST)

Telangana BJP Facing Problem with Jumping Leaders From Other Parties

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కు కొత్త తలనొప్పి తయారైంది. పార్టీలో కొత్త...పాత అంటూ వర్గ చీలిక వస్తుండటంతో నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం కత్తిమీద సాములా తయారైంది. బీజేపీ సంస్థాగతంగా ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ. వ్యక్తులకు కాకుండా పార్టీ నిర్ణయాలే ఇక్కడ అందరికీ శిరోధార్యం. వ్యక్తిగత ఎజెండాను అమలు చేయడం కుదరదు. కోర్ కమిటీలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే కోర్ కమిటీలోకి కేవలం కొత్తవారికే అవకాశం కల్పిస్తున్నారని... దశాబ్దాలుగా పార్టీనే పట్టుకుని పనిచేస్తున్న పాతతరం నేతలు గుర్రుగా ఉన్నారట.ఒకరిద్దరూ సీనియర్ నేతలు కూడా ఈవిషయాన్ని లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి స్పందించిన ఆయన ఇదీ కేవలం తాత్కాలిక కోర్ కమిటీ యే... వచ్చే ఏడాది శాశ్వత కోర్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో సమపాళ్లలో పార్టీ విధేయులందరికీ అవకాశం కల్పించడం జరుగుతుందని సర్ది చెప్పారట. అయితే కొత్తగా వచ్చిన వారు పార్టీ నిర్ణయాల్లో - విధానాల్లో కీలక భూమిక పోషించడం ఎందుకనో పాత నాయకులకు నచ్చడం లేదట.

అన్నీ వారే చేస్తే..మేం వారు చెప్పినట్లు చేసుకుంటూ పోవాలా అంటూ వ్యతిరేక రాగం తీస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిలో ఎవరికైనా కాస్త పేరుంటే చాలు కోర్ కమిటీలోకి తీసుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. అందులో భాగంగానే  కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణ - పొంగులేటి సుధాకర్ రెడ్డి - టీఆర్ ఎస్ నుంచి వచ్చిన  జితేందర్ రెడ్డి - వివేక్ - టీడీపీ నుంచి పెద్దిరెడ్డి - గరికపాటి మోహన్ రావు  వంటి నేతలకు కోర్ కమిటిలో చోటు కల్పించారు. దీంతో పాత నేతలంతా తాము చులకనైపోయామా ? అని వాపోతున్నారు.

ఎన్నో అటుపోటులను ఎదుర్కొని పార్టీని నిలబెట్టింది కార్యకర్తలు కొంతమంది నేతలే. దశాబ్దాల పాటు పార్టీలో ఉంటూ.. పార్టీనే నమ్ముకున్న వారికి కోర్ కమిటీలో స్థానం కల్పించడం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు సీనియర్ లీడర్లు. ఈ పరిస్థితి ఒక్క తెలంగాణలోనే కాదు పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీ బీజేపీలోనూ ఉంది. అక్కడ ఎన్నికలకు ముందు పార్టీలో ఉన్న వారి కంటే ఎన్నికలు ముగిశాక బీజేపీలోకి వచ్చిన వాళ్ల డామినేషనే కనిపిస్తోంది. అసలు అక్కడ పాత నేతల వాయిస్ ఎక్కడా వినపడడం లేదు.