కేటీఆర్ కు పోటీగా తీన్మార్ మల్లన్న.. టెస్లా చీఫ్ కు ట్వీట్

Mon Jan 17 2022 14:58:17 GMT+0530 (IST)

Teenmar Mallanna tweets to Tesla chief

ప్రపంచంలోనే అపర కుబేరుడు టెస్లా చీఫ్ ఎలన్ మస్క్. ఈ అమెరికా అంతరిక్ష పరిశోధకుడు ఎంతో ముందు చూపుతో ఆలోచించి తన ఉత్పత్తులను తయారు చేస్తుంటాడు. అంతరిక్షంలోకి యాత్రలను ఎలక్ట్రిక్ కార్లను సృష్టించాడు.  అమెరికాలోని టెక్సాస్ లోని ఆస్టిన్ కేంద్రంగా టెస్లా కార్లను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నాడు.ఇటీవల తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్ ఇందులోకి ఎంట్రీ ఇచ్చాడు.  టెస్లా కార్ల షోరూంను తెలంగాణలో ఏర్పాటు చేయాలని.. పెట్టుబడులు పెట్టాలంటూ ఎలాన్ మాస్క్ ను ఆహ్వానిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ వివాదానికి కేంద్రమైంది. తాను తెలంగాణ పరిశ్రమలు వాణిజ్యశాఖ మంత్రినని పరిచయంచేసుకొని టెస్లా కారు డ్రైవ్ చేస్తున్న ఫొటోను జతపరిచారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది.

ఇక ఈ ట్వీట్ కు బీజేపీ నేత జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ఓ పోల్ నిర్వహించారు. 'పెట్టుబడులకు తెలంగాణ చాంపియన్' అంటున్న కేటీఆర్ మాటలు నిజమేనా? అని ప్రశ్నిస్తూ పోల్ పెట్టారు. దీనికి నిజమే.. పచ్చి అబద్దం అని రెండు ఆప్షన్లను పెట్టారు.

ఈపోల్ ఫలితాలను తాజాగా తీన్మార్ మల్లన్న విడుదల చేశారు. నిజమే అంటూ 19శాతం మంది సమాధానం ఇచ్చారని.. పచ్చి అబద్దం అని 81 శాతం మంది ఓటు వేశారని తెలిపారు.

ఈ పోల్ రిజల్ట్స్ ను తీన్మార్ మల్లన్న ఏకంగా ఎలన్ మస్క్ కు ట్విట్టర్ ద్వారా పంపించారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వెనుక వాస్తవాన్ని గ్రహించండి అని విజ్ఞప్తి చేశారు. 33 వేల మంది పాల్గొన్న ఈ ఒపినీయన్ పోల్ ఫలితాలు ఇవీ అంటూ ఆయనకు వివరించారు. కేటీఆర్ ఫెయిల్ మినిస్టర్ అనే హ్యాష్ ట్యాగ్ ను దానికి జతచేశారు. మంత్రి కేటీఆర్ ఫెయిల్యూర్ అంటూ విమర్శించారు. తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం కాదనే సందేశాన్ని తీన్మార్ మల్లన్న ఎలన్ మాస్క్ కు పరోక్షంగా తెలియజేసినట్టైంది.

ఇక తెలంగాణ వచ్చేపెట్టుబడులు కూడా రాకుండా చేస్తావా? అంటూ నెటిజన్లు తీన్మార్ మల్లన్నపై మండిపడుతున్నారు. పెట్టుబడులు అభివృద్ధి విషయంలో రాజకీయాలను లాగవద్దని మల్లన్నకు హితవు పలుకుతున్నారు. కేటీఆర్ మీద కోపం ఉంటే ఆయనతో తేల్చుకోవాలని.. తెలంగాణను కించపరచడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. తెలంగాణను బాగు చేయడానికి చూడాలి కానీ.. ఇలా దిగజార్చవద్దని తీన్మార్ మల్లన్నపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.